కరోనా మహమ్మారి తర్వాత భారత రియల్ రంగం క్రమంగా పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలన్నీ ఎలా ఉన్నప్పటికీ మనదేశంలో రియల్ పరిశ్రమ బాగానే నిలదొక్కుకుందని చెప్పొచ్చు. వాస్తవానికి భారతీయ పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ తో చేదు, తీపి చరిత్ర ఉంది.
ముఖ్యంగా ఈ రంగంలో జరిగే మోసాలు.. రియల్ రంగం అంటే బాగా డబ్బున్నవాళ్లకే అనే భావన సాధారణ జనాల్లో ఉండటం వంటి అంశాలు చాలాకాలం కొనసాగాయి. ఈ క్రమంలో ఇందులో మోసాలను నియంత్రించేందుకు రెరా వంటి చట్టాలు వచ్చాయి. ఇక కరోనా వచ్చిన తర్వాత రియల్ రంగం బాగా ప్రభావితమైంది. దీంతో బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ గత ఐదేళ్లలో ఏడాదికి 7.8 శాతం రిటర్నులు.. గత పదేళ్లలో 6.7 శాతం రిటర్నులు అంచనా వేసింది. అయితే, దీనికి విరుద్ధంగా గత ఐదేళ్లలో అది 12.1 శాతం, గత పదేళ్లలో 12.5 శాతం రాబడి ఇచింది. ఈ నేపథ్యంలో రియల్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందనే సంకేతాలు వచ్చినట్టయింది.
గత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల బుకింగులలో భారీ పెరుగుదల రాబోయే మంచి సమయాలకు నాందిగా కనిపిస్తోంది. సగటు గృహ ఆదాయంలో పెరుగుదల, తక్కువ వడ్డీ రేట్లు, గృహ రుణాలు సులభంగా పొందే వీలు భారతీయులకు ఇల్లు కొనుగోలు చేయడం చాలా సులభమైన వ్యవహారంగా మారింది.
అంతేకాకుండా గృహ రుణాలపై రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు, పీఎంఈవై కింద రూ.2.67 లక్షల వరకు రాయితీ వంటివి జనం స్థిరాస్తి వైపు మళ్లేలా చేశాయి. జీఎస్టీ అమలు, రెరా చట్టం వచ్చిన తర్వాత వ్యవస్థీకృతంగా ఇది బలోపేతమైంది. అనరాక్ నివేదిక ప్రకారం రియల్ రంగంలో గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఖ్య 60 శాతం తగ్గగా.. పెరుగుతున్న సరఫరాలో బ్రాండెడ్ డెవలపర్ల వాటా 50 శాతానికి పైగా పెరిగింది. ఫలితంగా మోసాలు చాలా వరకు తగ్గాయి.