- విల్లాల పేరిట ఐదేళ్ల క్రితం ప్రీలాంచ్
- నేటికీ ఒక్క అంగుళం పని మొదలవ్వలేదు!
- ఐదేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే!
- పక్కనే అపార్టుమెంట్లు కడుతున్నారు..
- విల్లాల్ని పూర్తిగా మర్చిపోయారు..
- మళ్లీ పెద్ద గోల్కొండలో ప్రీలాంచ్ మాయ షురూ
కొల్లూరులో అందమైన విల్లాల్ని నిర్మిస్తామన్నారు.. ప్రీలాంచ్‌లో అయితే రేటు తక్కువన్నారు.. ఇంతకంటే తక్కువ రేటుకు ఎక్కడా దొరకదన్నారు.. ఈ అవకాశం మిస్ అయితే మరోసారి అదృష్టం తలుపు తట్టదన్నారు.. రియాల్టీ ఏజెంట్లు, మధ్యవర్తులు ఊదరగొట్టారు.. బడా ప్రాజెక్టుల్లో విల్లాలు కొనాలంటే ఏడేనిమిది కోట్లు అవుతుందని.. తమ వద్ద ముందే కొంటే.. కోటి రూపాయలకు అటుఇటుగా ఇచ్చేస్తామన్నారు.. ఈ మాటల్ని నమ్మి మధ్యతరగతి ప్రజలు పొలం, స్థలం, బంగారం, నగలు అన్నీ అమ్మేసి.. ఈ సంస్థ చేతిలో సొమ్ము పెట్టారు. అదిగో ఇదిగో అన్నారు.. మరో మూడు నెలల్లో ప్రాజెక్టు స్టార్ట్ అన్నారు.. అనుమతులు రావడమే ఆలస్యమన్నారు.. మూడు నెలలు కాస్త ముప్పయ్ ఆరు నెలలు దాటేసింది. విల్లా లేదు.. ప్రాజెక్టు లేదు.. నాలుగైదేళ్ల క్రితం ఎలాగైతే తవ్వి పెట్టారో.. నేటికీ ఒక్క అంగుళం కూడా పని ముందుకు కదల్లేదు. ఇందులో స్థానికులతో పాటు ప్రవాసులు పెట్టుబడి పెట్టారు. ఇలాంటి మోసపూరిత సంస్థల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టి.. దారుణంగా మోసపోయి.. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించట్లేదు.
గుంటూరులో నమోదైన ఆదిత్రి హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. దాదాపు ఐదేళ్ల క్రితం వెలిమలలో 20 ఎకరాల్లో విల్లా ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రీలాంచ్‌లో అమ్మకాల్ని ఆరంభించారు.
తక్కువ రేటులో విల్లా వస్తుందనే సంతోషంలో అధిక శాతం మంది అందులో పెట్టుబడి పెట్టారు. కొందరు కేవలం అడ్వాన్సుగా రూ.15 నుంచి 25 లక్షలు చెల్లిస్తే.. ఇంకొందరు యాభై లక్షల్నుంచి కోటీ రూపాయలను చెల్లించారు. విల్లాలు, అపార్టుమెంట్లు పక్కపక్కనే వస్తాయని మధ్యవర్తులు చెప్పిన మాటల్ని నమ్మేసి ఐదేళ్ల క్రితమే సొమ్ము కట్టేశారు. అదిగో అనుమతి వస్తుంది.. ఇదిగో అనుమతి వస్తుందంటూ మొదట్లో సంస్థ కాలయాపన చేసింది. ఈ లోపు కరోనా రావడంతో బిల్డర్ కు కాస్త ఊపిరి లభించినట్లయ్యింది. మొదట్లో 20 ఎకరాల విల్లా ప్రాజెక్టు కాస్త తర్వాత 10 ఎకరాలకు కుదించారు. ఈలోపు అపార్టుమెంట్ పనుల్ని ఆరంభించారు. విల్లాలు ఎప్పుడు నిర్మిస్తారని కొనుగోలుదారులు ఆదిత్రి సంస్థ ప్రతినిధుల్ని అడిగితే.. మళ్లీ పాత పాటే పాడుతున్నారు.
వెలిమలలో విల్లా ప్రాజెక్టును ప్రారంభించని సంస్థ మరో ప్రాంతంలో సరికొత్త ప్రీలాంచ్ మోసానికి తెరలేపింది. పెద్ద గోల్కొండలో ప్రీలాంచ్లో విల్లాల్ని విక్రయించడం ఆరంభించింది. అంటే అక్కడా విల్లాల్ని నిర్మిస్తుందో లేదో తెలియదు కానీ కొనుగోలుదారుల నుంచి అయితే యధేచ్చగా సొమ్ము వసూలు చేస్తోంది. మరి, మా విల్లా పరిస్థితి ఏమిటని వెలిమల బయ్యర్లు అంటుంటే సరికొత్త కుంటిసాకులు చెబుతోందని సమాచారం. ఈ సంస్థ వ్యవహారం ఎలా ఉందంటే.. ఐదేళ్ల క్రితం వెలిమలలో విల్లా కొన్నవారికి ఏదో రకంగా సొమ్ము చెల్లించి.. మళ్లీ కొత్త రేటుకు అమ్ముకోవచ్చనే ఎత్తుగడ వేసినట్లుగా పలువురు కొనుగోలుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి బడ్జెట్ వేరు, ఇప్పుడా రేటుకు ఇవ్వలేమని చెప్పకనే చెబుతున్నారని బయ్యర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కట్టిన సొమ్ముకు విల్లాను కట్టించివ్వకపోతే ఆదిత్రి సంస్థను వదిలే ప్రసక్తే లేదని కొందరు కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల క్రితం మాటిచ్చిన ప్రకారం విల్లాలను నిర్మించి ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఈ కథనంపై సంస్థ అభిప్రాయం తెలుసుకోవడానికి రెజ్ న్యూస్ ప్రయత్నించగా ఆదిత్రి హౌసింగ్ వెలిమల ప్రాజెక్టులో విల్లాలన్నీ అమ్ముడయ్యాయని చెప్పారు. పైగా పెద్ద గోల్కొండలో ప్రీలాంచ్ ఆఫర్‌లో కొత్త విల్లా ప్రాజెక్టును ఆరంభించామని అందులో ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. మరి, ఇప్పటికైనా తెలంగాణ రెరా అథారిటీ ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని బాధితులు అంటున్నారు.
ఆదిత్రి విల్లాల కోసం
ఐదేళ్లుగా ఎదురుచూపు!
ఆదిత్రి హౌసింగ్ సంస్థ 2018లో ప్రీలాంచ్‌లో విల్లాల్ని విక్రయించింది. అప్పట్లో కొందరు కొనుగోలుదారుల 214 గజాల్లో 2700 చదరపు అడుగుల విల్లాను చదరపు అడుక్కీ రూ.4750కి అటుఇటుగా కొనుగోలు చేశారు. 400 గజాల్లో ఐదు వేల చదరపు అడుగుల్లో విల్లాలను విక్రయిస్తామని సంస్థ ప్రీలాంచ్ ప్రకటించింది. దీంతో ఆకర్షితులైన ప్రవాసులు.. ఇంతకంటే తక్కువ రేటుకు ఎక్కడొస్తుందని చెప్పి.. వెనకా ముందు చూడకుండా.. ప్రీలాంచ్‌లో విల్లాల్ని కొనుగోలు చేశారు. వీరి దురదృష్టం ఏమిటంటే.. నేటికీ ఆదిత్రి ఎంపైర్ విల్లాస్ ప్రాజెక్టే ఆరంభం కాలేదు. 20 ఎకరాల్లో విల్లాలని చెప్పి.. కొన్నేళ్ల తర్వాత పదెకరాలకు కుదించారు. కానీ, నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా, అందులో కొన్నవారు సంస్థ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.