- తొలి ఆరు నెలల్లో 24 శాతం వృద్ధి
- సరఫరాలోనూ 148 శాతం పెరుగుదల
- సీబీఆర్ఈ నివేదిక వెల్లడి
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రిటైల్ లీజింగ్ రైజింగ్ లో ఉంది. గతేడాదితో పోలిస్తే 24 శాతం వార్షిక వృద్ధితో 2.87 మిలియన్ చదరపు అడుగులకు పెరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేటు లిమిటెడ్ పేర్కొంది. ఈ మేరకు ఇండియా మార్కెట్ మానిటర్ క్యూ2-2023 నివేదికలో పలు వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో 24 శాతం మేర వార్షిక వృద్ధి నమోదై 2.87 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. గతేడాది జూలై-డిసెంబర్ కాలంలో నమోదైన 2.31 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే 15 శాతం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరునెలల రిటైల్ లీజింగ్ మొత్తం కార్యకలాపాల్లో బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ లు కలిసి 65 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే 2023 జనవరి-జూన్ కాలంలో సరఫరా కూడా 148 శాతం మేర పెరిగింది. ఈ కాలంలో 1.09 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. గతేడాది ఇది 0.44 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.
మాల్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 8 శాతం వృద్ధి సాధించాయి. ఈ విషయంలో సరఫరాలో 73 శాతం వాటాతో అహ్మదాబాద్ మొదటి స్థానంగా ఉండగా.. 20 శాతం వాటాతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం లీజింగ్ 1.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. రిటైల్ స్పేస్ లీజింగ్ లో బెంగళూరు, ఢిల్లీ 59 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. ఇందులో బెంగళూరు 35 శాతం, ఢిల్లీ 24 శాతం వాటా కలిగి ఉండగా.. చెన్నై 14 శాతం వాటాతో ఉంది. మన హైదరాబాద్ కూడా లీజింగ్ లో చక్కని వృద్ధి సాధించింది. మొత్తం లీజింగ్ లో 11 శాతం వాటా హైదరాబాద్ దే కావడం విశేషం.