- విస్తృతమవుతున్న కొత్త తరహా
సౌర ఫలకాల వినియోగం
ఇటీవల కాలంలో సౌర విద్యుత్ వినియోగం పెరుగుతోంది. వ్యక్తిగత గృహాల నుంచి అపార్ట్ మెంట్ల వరకు ఎంతో కొంత సౌర విద్యుత్ వినియోగం వైపు మరలుతున్నాయి. వ్యక్తిగత ఇళ్లు అయితే, వారి టెర్రస్ పై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని, సౌర విద్యుత్ వినియోగించుకుంటుండగా.. అపార్ట్ మెంట్లలో కామన్ ఏరియా వినియోగం వరకు దీనిని వాడుతున్నారు. అయితే, అపార్ట్ మెంట్ లో ఉన్నవారు కూడా తమ ఫ్లాట్ వరకు సౌర విద్యుత్ వినియోగించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఈ ఇబ్బందికి చెక్ పడింది. మన ఫ్లాట్ కిటికీల నుంచే మనకు కావాల్సిన విద్యుత్ ను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఫొటోవాల్టాయిక్స్ సాంకేతికతతో మన కిటీకీల నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.
వాస్తవానికి ఇది ఏడెనిమిది ఏళ్ల క్రితమే వచ్చినా.. మన దగ్గర ఇటీవలే వీటి వాడకం పెరిగింది. ప్రస్తుతం ఇంటి కిటికీలు పెద్దవిగా, అద్దాలతో ఉంటున్నాయి. ఈ అద్దాలకు పల్చని ఫొటోవాల్టాయిక్స్ ను అతికిస్తారు. ఇది సెమీ ట్రాన్స్ పెరెంట్ కావడం వల్ల.. ఇంట్లోకి వెలుతురు యథాతథంగానే వస్తుంది. కిటికీలో ఎంత భాగం కావాలిస్తే అంత భాగం వరకు వీటిని అమర్చుకోవచ్చు. ఈ ఫొటోవాల్టాయిక్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కావడానికి ఎండ ఉండకపోయినా.. వెలుతురు ఉంటే సరిపోతుంది. అలా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను మన ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫలకాలు లోపలకు నేరుగా వేడిని రాకుండా అడ్డుకుంటాయి.