- రూ.3400 కోట్లు పెట్టుబడి పెట్టనున్న
సెంచరీ రియల్ ఎస్టేట్ సంస్థ
బెంగళూరులో మరో భారీ బిజినెస్ పార్క్ రాబోతోంది. ఆ నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సెంచరీ రియల్ ఎస్టేట్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు రూ.3400 కోట్లు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో ఆఫీస్ స్పేస్ తోపాటు రెసిడెన్షియల్ లాంచ్ లు ఉండనున్నాయి. తద్వారా ఏటా రూ.9వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో చిన్న రెసిడెన్షియల్, రిటైల్ విభాగాలలో ఉత్తర బెంగళూరులో 7 మిలియన్ చదరపు అడుగుల్లో ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్కును ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కంపెనీ ఎండీ రవీంద్ర పాయ్ తెలిపారు.
అలాగే ప్రైమ్ సెంట్రల్, ప్రైమ్ సబర్బన్ లోకేషన్లలో నాలుగు అపార్ట్ మెంట్ ప్రాజెక్టులు, రెండు విల్లా ప్రాజెక్టులు కూడా చేపట్టనున్నట్టు వివరించారు. ఇప్పటివరకు 3 మిలియన్ చదరపు అడుగుల్లో 4వేల నుంచి 4500 వరకు అపార్ట్ మెంట్లను డెలివరీ చేసినట్టు వివరించారు. అలాగే 800 ఎకరాల్లో 3వేల నుంచి 3500 ప్లాట్లు అభివృద్ధి చేసినట్టు చెప్పారు. కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్ల ఆదాయాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.