Categories: TOP STORIES

కొత్త ఇళ్ల సరఫరాలో తగ్గుదల

రెండో త్రైమాసికంలో 13 శాతం మేర క్షీణత

లోక్ సభ ఎన్నికలే కారణం

దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి కొత్త ఇళ్ల సరఫరా తగ్గింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం మేర తగ్గుదల నమోదైంది. లోక్ సభ ఎన్నికలు జరగడం వల్లే కొత్త ప్రాజెక్టులు లాంచ్ కాలేదని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటి పేర్కొంది. గతేడాది ఏప్రిల్-జూన్ లో 1,11,657 యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది ఆ సమయంలో 97,331 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చినా కూడా 7 శాతం తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా క్యూ2లో పుణె, హైదరాబాద్ లలో చాలా తక్కువ లాంచ్ లు నమోదయ్యాయి. అదే ఢిల్లీలో మాత్రం కొత్త యూనిట్ల సరఫరా దాదాపు రెట్టింపు కావడం విశేషం.

ఇక్కడ గతేడాది ఏప్రిల్-జూన్ లో 5,708 యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది క్యూ2లో 95 శాతం పెరుగుదలతో 11,118 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అలాగే బెంగళూరులో 21 శాతం పెరుగుదలతో 11,848 యూనిట్ల నుంచి 14,297 యూనిట్లకు పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. ఏకంగా 36 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది క్యూ2లో 18,232 యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది క్యూ2లో 11,603 యూనిట్లకు తగ్గింది. అత్యధికంగా పుణెలో 47 శాతం క్షీణత కనిపించింది. అక్కడ 29,261 యూనిట్ల నుంచి 15,568 యూనిట్లకు కొత్త లాంచ్ లు తగ్గాయి.

This website uses cookies.