పట్టణాల్లో సొంతింటి కోసం కొత్త పథకం

  • ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

పట్టణాల్లో సొంతిల్లు ఉండాలని కోరుకునే మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ కొత్త పథకం తీసుకు రానున్న‌ద‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బ్యాంకు రుణాలపై వడ్డీ నుంచి ఉపశమనం కలిగించేలా ఈ పథకం ఉంటుందని తెలిపారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పట్టణాల్లో నివసిస్తున్న సొంతిల్లు లేని మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడానికే ఈ పథకం తీసుకొస్తున్నట్టు తెలిపారు. ‘నగరాల్లో సొంతిల్లు ఉండాలనేది మధ్యతరగతి ప్రజల కల. అలాంటివారి కల నెరవేర్చడం కోసం మేం త్వరలోనే కొత్త పథకం తీసుకొస్తున్నాం. అద్దె ఇళ్లల్లో, అక్రమ కాలనీల్లో నివసిస్తున్నవారందరి సొంతింటి కల నెరవేర్చడానికి బ్యాంకు రుణాలపై వడ్డీ నుంచి ఉపశమనం కలిగించాలని నిర్ణయించాం’ అని మోదీ వివరించారు. కాగా, ప్రస్తుతం పట్టణ పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ అర్బన్ పథకం ఇప్పటికే కొనసాగుతోంది. 2015 జూన్ 25న ప్రారంభమైన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గతనెల 31 వరకు 118.9 లక్షల పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో ఇప్పటివరకు 76.02 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి.

This website uses cookies.