రియల్ ఎస్టేట్.. పట్టణీకరణ.. రెండూ ఒకదానికొకటి విడదీయరాని అనుబంధం కలిగి ఉన్న అంశాలు. పట్టణీకరణ ఎంత పెరిగితే స్తిరాస్థి రంగం అంతగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో రియల్ రంగంపై పట్టణీకరణ ఎలాంటి ప్రభావం చూపించింది?
భారతదేశంలో పట్టణీకరణ వేగవంతంగా జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పట్టణ ప్రాంతాలకు, నగరాలకు ఎక్కువగా తరలి వస్తున్నారు. ఈ ధోరణి ఇలా కొనసాగితే 2050 నాటికి దేశ జనాభాలో 40 కోట్ల మందికిపైగా పట్టణాల్లోనే నివసిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలాగే పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ కారణంగా దేశం నివాస రంగం 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. పట్టణీకరణకు అనుగుణంగా భారత్ 2040 నాటికి మౌలిక సదుపాయాలపై 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మరో నివేదిక పేర్కొంది. ఎక్కువ మంది ప్రజలు నగరాల్లోకి వస్తుండటంతో గృహాలు, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల, రియల్ ఎస్టేట్‌పై పట్టణీకరణ ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
గేటెడ్ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల ప్రస్తుతం ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్నాయి. జీవనశైలిని అప్‌గ్రేడ్ చేయాలనే కోరికతో ఈ ట్రెండ్ ఎక్కువవుతోంది. ప్రజలు భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రదేశాలలోనే పనిచేయడానికి, నివసించడానికి మొగ్గు చూపుతారు. తగిన కనెక్టివిటీతోపాటు అత్యాధునిక సౌకర్యాలు, గ్రీనరీ కలిగి ఉన్న ప్రదేశాలనే ఇష్టపడతారు.
స్మార్ట్ సిటీల పెరుగుదల అనేది చాలా ముఖ్యమైన మార్పుగా పరిగణించే అంశం. ఈ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందినవే కాకుండా పర్యావరణపరంగా స్థిరంగా ఉండేలా రూపొందించారు. నగరంలోని నివాసితులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, గృహాలు, మెరుగైన సేవలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చే లక్ష్యంతో స్మార్ట్ సిటీలపై ప్రభుత్వ ఓ విధానం రూపొందించింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కూడా నేరుగా డిజిటలైజేషన్ ద్వారా ప్రభావితమవుతోంది. నగరాలు.. పట్టణీకరణ ప్రక్రియను ప్రోత్సహించే డిజిటల్ హబ్‌లుగా రూపాంతరం చెందాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి రకంలో మార్పులు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.
హై-ఎండ్ హౌసింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ప్రజలు తమ జీవనశైలిని అప్‌గ్రేడ్ చేయడానికి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీఫంక్షనల్, ఆధునిక గృహాల కోసం చూస్తున్నారు. మరోవైపు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ తోపాటు ఇతర రియల్ ఎస్టేట్ క్లాసులు కూడా పెరుగుతున్నాయి. జనాభా పట్టణీకరణ ప్రభావం క్రమంగా రియల్ ఎస్టేట్ రంగానికి బాగా ఊతమిస్తోంది. తలసరి ఆదాయంలో పెరుగుదల కూడా రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడానికి నిజమైన కారణం. అందువల్ల ఆర్థిక వృద్ధికి దారితీసే పట్టణీకరణ, రియల్ ఎస్టేట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఇది నివాస రియల్ ఎస్టేట్ యొక్క అధిక వృద్ధికి దారితీసిందని చెప్పవచ్చు. 2050 నాటికి, జనాభాలో పట్టణ శాతం 2.5 బిలియన్లు పెరుగుతుందని అంచనా. అంటే.. రాబోయే రెండు దశాబ్దాల్లో నివాస స్థలాలకు డిమాండ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది.
This website uses cookies.