కింగ్ జాన్సన్ కొయ్యడ: తెలంగాణ నిర్మాణ రంగం సోమవారం బంద్ అయ్యింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో నిర్మాణ సంస్థలన్నీ నిర్మాణ పనుల్ని నిలిపివేశాయి. క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ వంటి నిర్మాణ సంఘాల లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు రెండు వేల మంది బిల్డర్లు, డెవలపర్లు ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 1200 మంది బిల్డర్లు పాల్గొనగా.. ఇతర పట్టణాలకు చెందినవారు దాదాపు ఎనిమిది వందల మంది దాకా ఉంటారు. సైట్లలో పని చేసేవారు రెండున్నర లక్షల మంది కార్మికులు పనుల్ని నిలిపివేశారు. పరోక్షంగా యాభై వేల మంది, ఆఫీసు స్టాఫ్ 25000 మంది.. మొత్తం కలిపితే సుమారు 3.25 లక్షల మంది ఈ బంద్‌లో పాల్గొని తమ సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్టీలు మీద విధించే ఏడున్నర శాతం దిగుమతి సుంకంతో పాటు స్టీలు మరియు ఇతర భవన నిర్మాణ సామగ్రిపై జీఎస్టీని తొలగించాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు తెలిపారు. భారత నిర్మాణ రంగానికి మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేయాలని కేంద్రాన్ని కొన్నేళ్ల నుంచి కోరుతున్నామని.. కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిర్మాణ రంగం బంద్ కార్యక్రమం విజయవంతం అయ్యిందని.. డెవలపర్లు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారని ట్రెడా ప్రధాన కార్యదర్శి మేకా విజయ్ సాయి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్మాణ సంఘాలన్నీ బంద్‌లో పాల్గొన్నాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ జనరల్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
This website uses cookies.