సొంత ఇల్లు ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ కల. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ కామన్ గా ఉండే లక్ష్యం. అభిరుచులు, అభిప్రాయాల్లో తేడా ఉండొచ్చు కానీ.. సొంతిల్లు మాత్రం అందరికీ జీవితకాల స్వప్నమే. మరి ఈ విషయంలో నటుడు బ్రహ్మాజీ అభిప్రాయాలు ఏమిటి? సొంతింటి విషయంలో ఆయన అభిరుచులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా పంచుకున్నారు. బ్రహ్మాజీ కలల ఇల్లు ఆయన మదిలోని ఉన్నత భావాలను ఆవిష్కరించింది. ఆయన భావోద్వేగాలు అందులో ప్రతిఫలించాయి. తన దృష్టిలో ఖాళీ ఇల్లు అంటే తప్పిపోయిన అవకాశాలవంటివని అభివర్ణించారు. ‘నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఈ నగరాన్ని శాశ్వత నివాసంగా మార్చుకున్నాను. తొలుత నేను రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉండేవాడిని. అది 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్. అయినా నాకు అది చిన్నదిగానే అనిపించేది. నా ఇల్లు ఇంకా పెద్దగా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచించేవాడిని. నా కోసం, నా కుటుంబం కోసం మరింత కష్టపడి పనిచేయాలనే విషయాన్ని అది గుర్తుచేసేది’ అని బ్రహ్మాజీ వివరించారు. సానుకూలమైన, సౌందర్యవంతమైన, ఆకర్షణయమైన స్థలం యొక్క శక్తి ఎవరూ కాదనలేదని వ్యాఖ్యానించారు. నిస్తేజంగా, చీకటిగా, నిర్జీవంగా ఉండే గది కంటే ప్రకాశవంతమైన, సంపూర్ణంగా అలంకరించిన గదినే తాను ఇష్టపడతానని చెప్పారు.
తన భార్య స్వయంగా ఇంటీరియర్ డిజైనర్ అని బ్రహ్మాజీ వెల్లడించారు. ‘నా భార్య ఇంటీరియర్ డిజైనర్ కావడం వల్ల నా ఇల్లు ఎలా ఉండాలనే విషయంలో ఎప్పుడూ నేను సలహాలు ఇవ్వలేదు. ఇంటిని అందంగా ఎలా అలంకరించుకోవాలో ఆమెకు తెలుసు. దానికి ఆమెనే ఇన్ చార్జి. ఆమె డిజైనర్ కమ్ డెకరేటర్. ఆమెకు కళాఖండాలు అంటే చాలా ఇష్టం. తనకు ఇచ్చిన స్థలాన్ని అందంగా అలంకరించేందుకు ఎలాంటి ఉపకరణాలు, కళాత్మక వస్తువులు, పెయింటింగులు వినియోగించుకోవాలో నిర్ణయించుకుంటుంది. గత ఐదారేళ్లుగా హైదరాబాద్ మార్కెట్ నుంచి మా ఇంటికి అద్భుతంగా సరిపోయే బోలెడు వస్తువులను తీసుకొచ్చి అలంకరించింది. అవన్నీ మన అవసరాలను అంచనా వేసే, మన భావోద్వేగాలను ప్రతిబింబించే కళాఖండాలు. మా ఇంట్లో అద్భుతమైన సేకరణ ఉంది. వాటిని చూస్తే దేశంలోని ప్రతి చోట ఉండే ఏదో ఒకటి గుర్తుకువస్తుంది. అది సెరెన్ బెల్ అయినా ప్రసిద్ధమైన పెయింటింగ్ అయినా.. మేం ఉండేచోట దానిని ఉంచడానికి ప్రయత్నిస్తాము. ప్రత్యేకత అనేది మన ఇంటికి మరింత వన్నె తెస్తుంది’ అని బ్రహ్మాజీ పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే దేశంలో అది హైదరాబాద్ లోనే అత్యుత్తమంగా ఉందని బ్రహ్మాజీ అభిప్రాయపడ్డారు. మరెక్కడా దొరకని నాణ్యమైన ఇళ్లను ఇక్కడే నిర్మిస్తున్నారని చెప్పారు. బ్రహ్మాజీ ఇంట్లో అప్పుడప్పుడు జరిగే పార్టీలకు వచ్చేవారు ఎవరైనా సరే.. అక్కడి ఇంట్లో ఉండే ఇంటీరియర్స్ గురించి మాత్రమే చెప్పుకోరు. బ్రహ్మాజీ ఇంటి పైన ఉన్న విలాసవంతమైన గ్లాస్ పెంట్ హౌస్ ను చూసి మంత్రముగ్ధులవుతారు. ఎంతో క్లాసీగా, స్టైలిష్ గా ఉండే ఆ ఇంటిని మలేసియా ఇంటిగా రెండు సినిమాల్లో కూడా చూపించారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చి తమ సినిమాను తెలంగాణలో చిత్రీకరించాలని అనుకుంటే వారు తన పెంట్ హౌస్ కోసం సంప్రదిస్తారని బ్రహ్మాజీ తెలిపారు. అలాగే తనకు కూనూర్, ఊటీలో తనకు ప్రాపర్టీ ఉందని వెల్లడించారు.
‘ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఓ ప్రాపర్టీ చూశాం. దానిని కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉందని భావించాం. ఇంద్రధనస్సులా భలే రంగులతో ఉంది. వాస్తవానికి నేను విలాసాలను ఇష్టపడను. అయితే, సెంటిమెంట్ డెకరేషన్ పట్ల నాకు బలమైన అనుబంధం ఉంది. మేం ఎప్పుడూ నా భార్య, నా అభిరుచులు రెండింటినీ కలపడానికి ప్రయత్నిస్తాం. ఇల్లు అనేది కమర్షియల్ హోటల్ లా ఉండకూడదు’ అని బ్రహ్మాజీ స్పష్టంచేశారు. విలాసవంతమైన ఇంటీరియర్లు బోరు తెప్పిస్తాయని.. కేవలం నాలుగు నుంచి ఐదేళ్లు మాత్రమే అవి బాగుంటాయని పేర్కొన్నారు. ‘విల్లా అయినా.. మీరు సొంతం చేసుకుంది ఏదైనా సరే.. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలని కోరుకోవడం మానవ నైజం. నాకు మాత్రం పెంట్ హౌస్ అత్యంత ఇష్టమైన ఆస్తి. ఎందుకంటే దాని విశాలమైన రూఫ్ టాప్ టెర్రస్ పై నిలబడి చూస్తే.. ఆ కిక్కే వేరు. అచ్చం గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టుంటుంది. అది నాకు ఎక్కడలేని చక్కని అనుభూతిని ఇస్తుంది. చాలామంది టాలీవుడ్ స్టార్లు ఆ పెంట్ హౌస్ చూసి ప్రశంసలు కురిపించారు. ఇక ఆ పెంట్ హౌస్ మరో భాగాన్ని పార్టీ ప్లేస్ గా చేశాం’ అని బ్రహ్మాజీ వివరించారు.
బ్రహ్మాజీకి విల్లాలపై అంత మక్కువ లేదు. అవన్నీ ఒకేలా కనిపిస్తాయనేది ఆయన భావన. డిజైన్ ఒక్కటే విలక్షణమైనదని, కానీ అక్కడ వ్యక్తిగత గోప్యత లేదనేది బ్రహ్మాజీ అభిప్రాయం. ఆయన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు అమితంగా ఇష్టపడతారు. ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. తన జేబులో రూ.100 కోట్లు ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రకారమే ఖర్చు చేస్తానని స్పష్టంచేశారు. ‘చాలామంది కోటీశ్వరులైన స్టార్లకు రూ.కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు నా ఇంటిని ఎంతో ఇష్టపడతారు. రాంగోపాల్ వర్మ ఇచ్చిన అభినందనలు మర్చిపోలేను. తాను ముంబైలో బోలెడు విలాసవంతమైన ఇళ్లను చూశానని, కానీ మణికొండలోని నా ఇంటిని చూసి ముగ్ధుడైనట్టు చెప్పారు. మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించడం అంత సులభం కాదు. అదో పెద్ద పోరాటమే. ఈ విషయంలో నాకు ఎంతగానో సహకరించింది’ అని తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ట అభిమాని అయిన బ్రహ్మాజీ ప్రతి ఏటా నాంపల్లిలో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. అక్కడ లభించే డెకరేషన్ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు. ఇక టాలీవుడ్ ప్రముఖుల్లో ఆయనకు మణికొండ కొండపై ఉన్న వెంకటేష్ ఇల్లు అంటే చాలా ఇష్టమని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు చుట్టివచ్చిన బ్రహ్మాజీ.. ఊటీలో ఓ ఇల్లు కట్టుకోవాలని ఉందని వెల్లడించారు. అందమైన ఆ పట్టణంలో అదిరిపోయే ఇల్లు కట్టుకోవాలన్నదే తన అభిలాష అని చెప్పి ముగించారు.
This website uses cookies.