Categories: LATEST UPDATES

సమాచారం కొట్టు.. బహుమతి పట్టు!

  • అక్రమ ఇసుక తవ్వకాల గురించి చెప్తే పాతిక వేలు

అక్రమ ఇసుక తవ్వకాలకు చెక్ చెప్పేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక రీచ్ ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని.. ఇసుకను ప్రభుత్వం నిర్ధారించిన ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఆదేశించారు. ఇసుకను అక్రమంగా తవ్వుతున్నట్టు ఎవరైనా వీడియో లేదా ఇతరత్రా ఆధారాలు సమర్పిస్తే, వారికి రూ.25వేల నజరానా ఇవ్వాలని సూచించారు. అలాగే ఇసుక రవాణా చార్జీలను సైతం ఆయా డిప్యూటీ కమిషనర్లే నిర్ధారించాలని పేర్కొన్నారు.

ఇసుక రీచ్ నుంచి గమ్యస్థానం ఉండే దూరాన్ని బట్టి చార్జీలు నిర్ణయించాలని సూచించారు. అలాగే ఏదైనా గ్రామపంచాయతీకి ఇసుక కావాల్సి వస్తే.. వారికి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని.. వారి నుంచి ఎలాంటి చార్జీలూ వసూలు చేయొద్దని స్పష్టంచేశారు. ఇసుక రవాణా చేసే ట్రాలీల నుంచి చార్జీలు తీసుకోవద్దని.. కేవలం ట్రక్కుల నుంచి మాత్రమే చార్జీలు వసూలు చేయాలని చరణ్ జిత్ పేర్కొన్నారు. క్యూబిక్ ఫీట్ ఇసుకకు రూ.5.50 మాత్రమే తీసుకోవాలన్నారు. అలాగే గతంలో మూసివేసిన ఇసుక సైట్లను వెంటనే తెరవాలని ఆదేశించారు.

ఈ విషయంలో లూథియానా, జలంధర్, హొషియార్ పూర్, మొహలి, రోపర్ జిల్లాల అధికారులు తీసుకున్న చర్యలను సీఎం అభినందించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడేవారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని, ఈ విషయంలో రాజకీయ జోక్యాన్ని సహించనని ఆయన తేల్చిచెప్పారు.

This website uses cookies.