రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఏకంగా 26,027 రిజిస్ట్రేషన్లు జరగడమే ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే సమయంలో 22,632 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది 15 శాతం అధికంగా ఇవి జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది.
2022 జనవరి-ఏప్రిల్ లో జరిగిన 24,866 రిజిస్ట్రేషన్లతో పోల్చినా ఇవి ఎక్కువేనని తెలిపింది. ఇళ్ల కొనుగోలులో విస్తీర్ణానిదే ప్రధాన పాత్రగా ఉంది. గతేడాదితో పోలిస్తే.. 3వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లు 2 శాతం నుంచి 4 శాతానికి పెరిగాయి. అలాగే 2వేల చదరపు అడుగుల నుంచి 3వేల చదరపు అడుగుల విస్తీర్ణం లోపు రిజిస్ట్రేషన్లు 8 నుంచి 11 శాతానికి పెరిగాయి. 1000 నుంచి 2 వేల చదరపు అడుగుల ఇళ్లు 69 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి. వెయ్యి లోపు ఇళ్ల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 20 శాతం నుంచి 16 శాతానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది.
ఇక రూ.50 లక్షలలోపు విలువ ఉన్న ఇళ్లు గతేడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 4 శాతం తగ్గాయి. 2023లో 16,060 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 2024లో 15,419 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ధర కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2023 జనవరి-ఏప్రిల్ కాలంలో 4,512 జరగ్గా.. 2024లో 47 శాతం అధికంగా 6,649 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2023లో 2,060 జరగ్గా.. 2024లో 3,959 రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్‌ఫ్రాంక్ వెల్లడించింది.