కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం షాక్‌కు గురయ్యేలా వ్యవహరించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి రాగానే ఎయిర్‌పోర్టు మెట్రో రూటు మార్పు, ఫార్మా కారిడార్ రద్దు అంటూ పలుసార్లు ప్రకటన చేయగానే.. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు నివ్వెరపోయారు. ప్రవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల సమయంలో తాను రియల్ రంగం నుంచి వచ్చానని పలుసార్లు ప్రకటించిన సీఎం.. సానుకూలమైన ప్రోత్సాహాకర వాతావరణం మీదే ఆధారపడుతుందనే విషయం తెలియదా అంటూ సామాన్యులు ప్రశ్నించారు. అప్పటి నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది.
ఎన్నికల సీజన్ కారణంగా ఇళ్లను కొనేవారి సంఖ్యా తగ్గిపోయింది. నేటికీ, ఆ ప్రతికూల వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో భూముల మార్కెట్ విలువల్ని పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం రియల్ రంగంలో ఆశ్చర్యపోయింది. రియాల్టీని ప్రోత్సహించడం మానేసి.. మార్కెట్ విలువల్ని పెంచడంపై దృష్టి సారించడం కరెక్టు కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూమలు విలువల సవరణ జరగాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంతమేర భూముల విలువలు పెంచడం, తగ్గించడం చేయాలో శాస్త్రీయంగా నిర్ధారించాల్సిన అవసరముంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఆ మేరకు మనం తగ్గించాలా లేక పెంచాలా అనే విషయాన్ని అధికారులు అధ్యయనం చేయాలి.
భూముల మార్కెట్ విలువ పెంపుదలపై రాష్ట్ర నిర్మాణ రంగం ఒకవైపు ఆహ్వానిస్తూనే.. ఈ ప్రక్రియను చేపట్టడానికిది సరైన సమయం కాదని అభిప్రాయపడుతోంది. డిసెంబరులో కొత్త ఏర్పడిన తర్వాత.. జూన్ దాకా ఎన్నికల కోలాహలం మార్కెట్లో నెలకొంది. ఈ క్రమంలో రియల్ మార్కెట్లో అమ్మకాలు పెద్దగా జరిగిన దాఖలాల్లేవు. ఇలాంటి నేపథ్యంలో, రంగాన్ని ప్రోత్సహించడం మానేసి.. ఇలా మార్కెట్ విలువల్ని పెంచాలనుకోవడం కరెక్టు కాదని పలువురు డెవలపర్లు అంటున్నారు. ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కలిపితే ఏడున్నర శాతముంది. అయితే, ఈ ఛార్జీలను నాలుగున్నర లేదా ఐదు శాతానికి తేవాలని చెబుతున్నారు. వచ్చే ఒకట్రెండేళ్ల దాకా ఈ మార్కెట్ విలువల పెంపుదల గురించి మాట్లాడకపోతేనే బెటర్ అని అంటున్నారు.
This website uses cookies.