కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి కరీంనగర్ రియాల్టీ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని క్రెడాయ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్లో నిర్మాణాలు చేపట్టే ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. గత కొంతకాలం నుంచి కరీంనగర్ సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని.. కాకపోతే ఇక్కడి నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్‌లో ఏయే ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి? ఎక్కడెక్కడ స్థలాల ధరలెలా ఉన్నాయి? ఇక్కడి నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు.. మార్కెట్ అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన నిర్ణయాలేమిటో ఆయన మాటల్లోనే..
’’గత అక్టోబరు నుంచి 2021 మార్చి 31 దాకా కరీంనగర్‌లో భూముల విలువలు దాదాపు ముప్పయ్ శాతం పెరిగాయి. కొన్ని శివార్లలో రెండింతలైంది. కరీంనగర్, కార్పొరేషన్, శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థల రాకతో నివాస ప్రాంతాల సంఖ్య పెరిగింది. కొత్తపల్లి, సీతారాంపూర్, ఆరేపల్లి వంటి ప్రాంతాలు కార్పొరేషన్‌లో కలిసిపోయాయి. అప్పటివరకూ గుంట (121 గజాలు) స్థలం రూ.6 నుంచి 7 లక్షలుండేది. ప్రస్తుతం రూ.20-25 లక్షలకు చేరింది. నీటి లభ్యత పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో.. ఎకరాకు రూ.4-5 లక్షలున్న వ్యవసాయ భూమి ధర పది నుంచి పన్నెండు లక్షలకు చేరింది.
కరీంనగర్ ని భౌగోళికంగా గమనిస్తే.. ఆరు ప్రధానమైన రహదారులున్నాయి. జగిత్యాల రోడ్డు.. చొప్పదండి రోడ్డు.. పెద్దపల్లి రోడ్డు.. హైదరాబాద్, వరంగల్, వేములవాడ-సిరిసిల్లా తదితర రహదారులు వంటివి ఉన్నాయి. వ్యవసాయం అధికంగా ఉండే జగిత్యాల రోడ్డు.. ముందు నుంచీ అభివృద్ధి చెందింది. అక్కడ్నుంచి చాలామంది పిల్లల చదువు, ఉద్యోగ నిమిత్తం జిల్లా హెడ్ క్వార్టర్ కు చేరువగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుంటున్నారు. శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రోడ్డు, వరంగల్ రోడ్డు పురోగతి చెందుతోంది. కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత భూముల విలువలు గణనీయంగా పెరిగాయి. జగిత్యాల రోడ్డులో సీతారాంపూర్, ఆరేపల్లి వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ యాక్టివిటీ ఎక్కువగా పెరుగుతోంది.
కరీంనగర్ పట్టణ ప్రాంతానికి చేరువలో.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో.. ప్లాటు కొనాలంటే గుంటకు కనీసం రూ.10 లక్షలు.. గరిష్ఠంగా రూ.30 నుంచి 40 లక్షల దాకా పెట్టాల్సి ఉంటుంది. సిటీ పరిధిలో కమర్షియల్ రోడ్డులో ప్లాటు కొనాలంటే గజానికి రూ. లక్ష పెట్టాల్సిందే. వేములవాడ, పెద్దపల్లి రోడ్డు, ఆరేపల్లి, సీతారాంపూర్ వంటి ఏరియాల్లో ఎక్కువగా అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే, చదరపు అడుక్కీ కనీసం రూ.3 వేలు పెట్టాల్సి ఉంటుంది. రెండు లక్షల దాకా కారు పార్కింగు కోసం పెట్టాలి. ఇప్పటికే మూడు స్క్రీన్ల ప్రతిమా మల్టీప్లెక్స్ పూర్తయ్యింది. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకోడిగా కొనసాగుతోంది. గతంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు.. అందులో ఇల్లు కట్టేందుకు అనుమతి రాక ఇబ్బంది పడుతున్నారు. పోనీ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఫైళ్లకు మోక్షం లభించట్లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మొత్తం హోల్డ్ లో పెట్టారని అధికారులు అంటున్నారు. దీని వల్ల కరీంనగర్ నిర్మాణ రంగం ఇబ్బంది పడుతోంది. గత ఆగస్టు నుంచి ఎల్ఆర్ఎస్ ఫైళ్లకు మోక్షం లభించకపోవడం వల్ల కొత్త అపార్టుమెంట్లు రావడం లేదు.
This website uses cookies.