ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో రియల్ బూమ్ కొనసాగుతోంది. ఇక్కడ భూములు కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భూమి కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ నగరంలో భూమి కలిగి ఉన్న ఆయన.. తాజాగా రెండో చోట 54,454 చదరపు అడుగుల భూమిని కొన్నట్టు సమాచారం. రామమందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉంది. 2024లో రామమందిర ప్రతిష్ట తర్వాత అమితాబ్ అయోధ్యలో రెండవసారి పెట్టుబడి పెట్టారు.
అమితాబ్ తండ్రి గౌరవార్థం 2013లో ఏర్పడిన హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. గతేడాది జనవరి 16న హవేలీ అవధ్ వద్ద ఆయన రూ.4.54 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. అమితాబ్ తరపున రాజేష్ రిషికేశ్ యాదవ్ రెండు భూమి ఒప్పందాలను చేసినట్లు సమాచారం. హవేలీ అవధ్‌లోని భూమిని నివాస ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని, ఇప్పుడు కొనుగోలు చేసిన పెద్ద భూమిని స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని అమితాబ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.