Categories: LEGAL

స్మాండో ప్రాజెక్టులో అద‌న‌పు అంత‌స్తులా?

  • అదనపు అంతస్తుల నిర్మాణం అనైతిక వ్యాపారం
  • దీనివల్ల కొనుగోలుదారులకు నష్టం
  • రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టీకరణ
  • నష్టపరిహారం చెల్లించాలని పీబీఎస్ఆర్ డెవలపర్స్ కు ఆదేశం

అపార్ట్ మెంట్లలో అదనపు అంతస్తుల నిర్మాణానికి వీలుగా డెవలపర్లు హక్కులు ఉంచుకోవడం అనేది ఏకపక్ష నిబంధన అని.. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోతారని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. నిర్మాణ ప్లాన్ లో మార్పు చేర్పులు చేసే హక్కు ముసుగులో అదనపు అంతస్తులకు వెళ్లడం అనైతిక చర్య అని.. అది ఎంతమాత్రం సబబు కాదని పేర్కొంది. ఒప్పంద రూపకల్పన చేసే నిర్మాణదారు చేర్చే ఈ ఏకపక్ష నిబంధనను కొనుగోలుదారు నిరాకరించే పరిస్థితి ఉండదని, కానీ ఇది అనైతిక వ్యాపారం అని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో తొలి ఒప్పందం మేరకు స్థలంలో అవిభాజ్య హక్కుల ప్రకారం ఫ్లాట్ విలువను సర్దుబాటు చేయాలని పీబీఎస్ఆర్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ను ఆదేశించింది. అంతేకాకుండా నిర్మాణంలో జాప్యం జరిగిన కాలానికి చదరపు అడుగుకు రూ.5 చొప్పున, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.2 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.25వేలు చెల్లించాలని స్పష్టంచేసింది.

పీబీఎస్ఆర్ డెవలపర్స్ గచ్చిబౌలిలో చేపట్టిన స్మాండో గచ్చిబౌలి ప్రాజెక్టులో టి.వసంత కుమార్, ఆయన తండ్రి 2014లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం 2016కి నిర్మాణం పూర్తికావాలి. కానీ అదనపు అంతస్తల నిర్మాణం పేరుతో జాప్యం చేశారు. గడువు తీరి రెండేళ్లయినా ఫ్లాట్ అప్పగించకపోవడంతో వసంతకుమార్, ఆయన తండ్రి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం రూ.49.64 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. తాము రూ.44.97 లక్షలు చెల్లించామని చెప్పారు. తమ బ్లాక్ లో రెండు సెల్లార్లు, స్టిల్ట్, 16 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు పొందగా.. అదనంగా 5 అంతస్తులకు అనుమతి తీసుకుని సప్లిమెంటరీ అగ్రిమెంట్ పంపించారని, కానీ దానిపై తాము సంతకం చేయలేదని తెలిపారు. అవిభాజ్య స్థలం వాటా ఎంతో అందులో వివరించలేదన్నారు. తాము ఫ్లాట్ ను రూ.55.45 లక్షలకు విక్రయించామని.. ఇంకా కొనుగోలుదారు రూ.10 లక్షలు బకాయి ఉన్నారని నిర్మాణదారు తెలిపారు. తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బకాయిలు రావాల్సి ఉందని.. అలాగే వర్షాలు, రాజకీయ ఇసుక కొరత కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపింది. వాదనలు విన్న కమిషన్.. 90 శాతం సొమ్ము చెల్లించినా ఫ్లాట్ అప్పగించకపోవడంతో 2017 జూలై నుంచి చదరపు అడుగుకు రూ.5 చొప్పున ఫ్లాట్ అప్పగించే వరకు చెల్లించాలని నిర్మాణ సంస్థను ఆదేశించింది. మానసిక వేదనకు రూ.2 లక్షలు, ఖర్చుల కింద రూ.25 వేలు నెల రోజుల్లోగా చెల్లించాలని సూచించింది.

This website uses cookies.