Categories: TOP STORIES

ఏపీకి రండి.. పెట్టుబడులు పెట్టండి

– గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్ సమావేశంలో సీఎం జగన్
– పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని వెల్లడి

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ముందున్న ఏపీ.. పెట్టుబడులకు సులభమైన రాష్ట్రమని పేర్కొన్నారు. విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కర్టెన్ రైజర్ పేరుతో ఓ సమావేశం జరిగింది. ఇందులో జగన్ పాల్గొన్నారు. దాదాపు 40కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు.

ఏపీలో అపార వనరులు ఉన్నాయని, తమ రాష్ట్రంలో మినరల్స్ కు కొదవ లేదని పేర్కొన్నారు. పరిశ్రమలో ఎలాంటి అవసరాలున్నా ఒక్క ఫోన్ కాల్ తో స్పందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో 974 కిలోమీటర్ల విస్తారమైన తీర ప్రాంతం ఉందని, నాలుగు ప్రాంతాల్లో 6 పోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో ఏపీలో మూడు కేటాయించారని తెలిపారు. వైజాగ్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లు ఏపీలో వస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీకి విచ్చేసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీలో ఎలాంటి సౌకర్యాలున్నాయో, ప్రస్తుతం ఏయే పరిశ్రమలు ఉన్నాయో వివరించారు.

  • ఇవీ ముఖ్యాంశాలు..

  • ఓడరేవు నగరం విశాఖపట్నం ఏపీకి ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది.
  • కొప్పర్తి సమీపంలో 6,739 ఎకరాల్లో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ వస్తోంది. అలాగే మరో 540 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కానుంది.
  • తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.వెయ్యి కోట్ల సాయం కూడా ఇవ్వనుంది.
  • అనంతపురం, విశాఖపట్నంలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల అభివృద్దికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఓర్వకల్, కొప్పర్తిలో కూడా ఇలాంటి పార్కుల ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి.
  • కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 7.48 ఎకరాల స్థలంలో మెగా ఫుడ్ పార్కును ఏపీఐఐసీ అభివృద్ధి చేసింది.
  • కొప్పర్తిలోని 225 ఎకరాల్లో పవర్ ఎక్విప్ మెంట్ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు కేంద్రం గ్రాంటు ఇవ్వనుంది.
  • కేంద్ర ప్రభుత్వం సాయం ద్వారా ఏపీఐఐసీ పలు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 11 ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఏర్పాటు చేయగా.. మరో 22 ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి.
  • సకల సౌకర్యాలతో కూడిన 534 ఇండస్ట్రియల్ పార్కులను ఏపీఐఐసీ ఏర్పాటు చేసింది.
  • నాలుగు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లతో కూడిన భారత్ లోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
  • భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమేటివ్ హబ్ లు కలిగిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కియా మోటార్స్, ఇసుజు మోటార్స్, హీరో మోటార్స్, అశోక్ లేలాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ సహా పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.
  • ఆసియాలోనే పెద్ద ఇంటెగ్రేటెడ్ మెడికల్ డివైసెస్ మాన్యుఫాక్చరింగ్ పార్కు విశాఖపట్నంలో ఉంది.
    – రాష్ట్రంలో 250కి పైగా బల్క్ డ్రగ్ యూనిట్లు ఉండగా.. వాటిలో 38 యూనిట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. అలాగే మరో యూనిట్లకు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు లభించింది. ఏపీలోని ఫార్మా విభాగం భారతదేశ ఉత్పత్తిని పెంచడంలోనూ, దేశీయ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విభాగం 2021-22లో రూ.18వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే 88,984 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది.
  • కాకినాడలో వెయ్యి ఎకరాల్లో కొత్త బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కానుంది. బయో మెడికల్ వేస్ట్, ఇతర వ్యర్థాల నిర్వహణకు ఏపీ పర్యావరణ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది.
  • పత్తి ఉత్పత్తిలో ఏపీ అతిపెద్ద రాష్ట్రం, ముడి సిల్క్ ఉత్పత్తిలో రెండో అతిపెద్ద రాష్ట్రం. జూట్ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.

This website uses cookies.