ప్రముఖ నిర్మాణ కంపెనీ అపర్ణా కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి పెట్టనుంది. పొప్పాలగూడలో అపర్ణా జెనన్ అనే ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా రూ.2,550 కోట్లు వెచ్చించనున్నది. మొత్తం 37 ఎకరాల్లో 33 అంతస్తుల చొప్పున 14 బ్లాకుల్లో 3,664 ఫ్లాట్లను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. 1027 చదరపు అడుగుల నుంచి 2257 చదరపు అడుగుల వరకు సింగిల్ బెడ్ రూం నుంచి 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే ఫ్లాట్లు లభ్యం కానున్నాయి. ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది.
ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు కమర్షియల్ బ్లాక్, 86,423 చదరపు అడుగుల క్లబ్ హౌస్ డెవలప్ చేస్తారు. అంతేకాకుండా ప్రతి అపార్ట్ మెంట్ కు సెంట్రలైజ్డ్ గ్యాస్ బ్యాంకు నుంచి పైపు లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు. వీటితో పాటు కామన్ ఏరియాల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తారు. ‘వచ్చే ఏడాది అటు నివాస, ఇటు వాణిజ్య విభాగాల్లో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడం ద్వారా 30 శాతం మేర సంస్థ వృద్ధి నమోదు చేస్తుందనే గట్టి విశ్వాసంతో ఉన్నాం. అలాగే దాదాపు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాం’ అని అపర్ణ సంస్థ ఎండీ ఎస్ఎస్ రెడ్డి తెలిపారు.
This website uses cookies.