Categories: LATEST UPDATES

రియల్ రంగంలో అపోలో భారీ పెట్టుబడులు

  • ఈ ఏడాది రూ.7750 కోట్లు వెచ్చించాలని నిర్ణయం

కరోనా నేపథ్యంలో ఒడుదొడుకులకు లోనైన రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ గాడిన పడింది. ఈ నేపథ్యంలో ఇతర రంగాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం రియల్ రంగం వైపు చూస్తున్నాయి. తాజాగా ఈ ఏడాది వంద కోట్ల డాలర్లను(దాదాపు రూ.7,750 కోట్లు) రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అపోలో గ్లోబల్ మేనేజ్ మెంట్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ భావిస్తోంది. గతేడాది 750 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.5800 కోట్లు) ఈ రంగంలో పెట్టుబడిగా పెట్టింది. ఇందులో మూడింట రెండొంతుల మొత్తాన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులపైనే వెచ్చించింది. తాజాగా పెట్టబోయే మొత్తంతో కూడా 70 శాతం రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లోనూ, మిగిలిన మొత్తం వాణిజ్య ప్రాజెక్టుల్లోనూ వెచ్చించాలని భావిస్తున్నట్టు సంస్థ భాగస్వామి నిపుణ్ సాహ్ని తెలిపారు.

కోవిడ్ ముందునాటి పరిస్థితులకు రియల్ రంగం చేరుకుందని, కొన్ని చోట్ల 2019 కంటే బాగా పెరిగిందని పేర్కొన్నారు. ముంబైలో 2008లో ఆఫీస్ ప్రారంభించిన అపోలో.. భారతీయ డెవలెపర్లకు రుణాలివ్వడం 2017 నుంచి ప్రారంభించింది. మరుసటి ఏడాది ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్స్ లిమిటెడ్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి షాడో బ్యాంకులు సమస్యల్లో కూరుకుపోవడంతో అపోలో తన కార్యకలాపాలను మరింత పెంచింది. అపోలో సగటు రుణం 40 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.310 కోట్లు) నుంచి 60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.465 కోట్లు) మధ్య ఉంటుందని సాహ్ని తెలిపారు.

This website uses cookies.