నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ పరిశ్రమక సంబంధించి ప్రత్యేక కోర్సులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సూచనలు చేసింది. ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్న న్యాక్ ను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి చైర్మన్ గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, క్రెడాయ్ నుంచి ముగ్గురు, బిల్డర్స్ అసోసియేషన్ నుంచి ఇద్దరు, సీఐఐ నుంచి ఒకరిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ తన నివేదిక తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది.
సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో నిర్మాణ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఉన్న సంస్థలు, అకాడమీలను ఈ కమిటీ పరిశీలించి, ఆ మేరకు ఇక్కడ కూడా నిర్మాణ రంగానికి సంబంధించి ప్రత్యేక యూనివర్సటీ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. యూనివర్సిటీ స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సామర్థ్యాలు న్యాక్ కు ఉన్నాయని పేర్కొంది.
వర్సిటీ ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులన్నీ న్యాక్ ఉన్నాయని వివరించింది. నిధులతోపాటు భూమి సైతం అందుబాటులో ఉందని.. మొత్తం 40 ఎకరాల న్యాక్ క్యాంపస్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు 20 ఎకరాలు సరిపోతాయని తెలిపింది. తొలుత బీటెక్ స్థాయిల ఐదు ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలని సూచించింది. అడ్వాన్స్ డ్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ డిజిటల్ కన్ స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మేనేజ్ మెంట్, స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ కన్ స్ట్రక్షన్, స్కూల్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అందులో ఉండాలని పేర్కొంది.
వీటిలో దేశ విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ‘ఈ పరిశ్రమకు అనుకూలమైన కోర్సులు ఉంటే, విద్యార్థులు వాటిని పూర్తిచేసిన వెంటనే ఇందులో నిలదొక్కుకోగలుగుతారు. కానీ ప్రస్తుతం ఉన్న సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు నిర్మాణ రంగంలో మారుతున్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఉండటంలేదు’ అని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని.. అనుమతి రాగానే సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందిస్తామని న్యాక్ డీజీ కె. బిక్షపతి తెలిపారు.
This website uses cookies.