గత కొన్నేళ్లలో దాదాపు మూడున్నర కోట్ల పక్కా ఇళ్లను నిర్మించడం తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమైని ఇటీవల ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకున్నారు. 2015లో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద ఈ ఘనత సాధించినట్టు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో చాలామంది నిరాశ్రయులు ఉన్నారు. పట్టణ ప్రజల్లో దాదాపు 2 లక్షల మందికి ఇళ్లు లేవు. దాదాపు ఆరున్నర కోట్ల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. చాలామంది చాలా ఇరుకైన ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. అలాంటి ఇళ్ల తలసరి నేల వైశాల్యం కేవలం 83 చదరపు అడుగులు. అంటే చాలామంది ప్రజలు చాలా చిన్న, ఇరుకైన ఇళ్లలో ఉంటున్నారు.
2030 నాటికి పట్టణ జనాభా 60 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, ఇంతమంది ప్రజలకు తగిన నివాస స్థలాన్ని ఇచ్చే హామీ ఏ ప్రభుత్వ పథకమూ ఇవ్వలేకపోయింది. మనదేశంలో ఎగువ మధ్యతరగతి వరకు అన్ని ఆదాయ తరగతుల వారు సొంతిల్లు కొనడం కష్టం. అలాగే కనీస వేతనాలు పొందే వ్యక్తులకు ఇది దాదాపు అసాధ్యమైన లక్ష్యం. ఫలితంగా ఇలాంటి వ్యక్తులు అద్దె ఇళ్లలో లేదా తాత్కాలిక మురికివాడల్లో నివసిస్తున్నారు. మరి ఇలాంటివారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎంతవరకు ఉపయోగపడుతుందో చూద్దాం.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు చెందిన ప్రజలకు సరమైన ధరలో గృహాలను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) ప్రారంభించారు. 2022 నాటికి ప్రతి భారతీయ కుటుంబానికి గ్యాస్, నీరు, విద్యుత్ సరఫరాతో కూడిన సిమెంటు, ఇటుకలతో నిర్మించిన ఇంటిని అందించాలని మోద సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, ఇది పూర్తిగా అమలు కాలేదు. ఈ పథకం కింద మంజూరైన 1.14 కోట్ల పట్టణ గృహాల్లో కేవలం 50 శాతం మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి.
వాస్తవానికి ఈ పథకం కింద ప్రజలకు ఉచితంగా ఇళ్లు రావు. ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకోవడానికి వీలుగా మున్సిపాలిటీలకు ఈ పథకం కింద కొంత డబ్బు వస్తుంది. దానికి ప్రజలు తమ వాటాను చెల్లించి ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రజల ఆదాయంలో తగ్గుదల కారణంగా వారి వాటాను చెల్లించకపోతే ఈ ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోతాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల కొరత కారణంగా కొన్ని పూర్తయిన గృహ ప్రాజెక్టులు ప్రధాన నగరాలకు దూరంగా ఉన్నాయి. దీంతో ప్రజలు తమ కార్యాలయాలకు వెళ్లడం కష్టం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించడంతో వీటిపై ఆసక్తి చూపించరు. ఫలితంగా అవి ఖాళీగా ఉంటాయి.
పీఎంఏవై పథకం మరింతగా విజయం సాధించాలంటే.. ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికి వీలుగా వారికి మరింత ఆర్థిక సహాయం అందించాలి. పూర్తయిన గృహ ప్రాజెక్టులకు మరింత కనెక్టివిటీ కల్పించాలి. పథకం కింద అర్హత పొందే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలి. ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారిస్తే.. 2024లోగా ప్రతి కుటుంబానికి ఇల్లు అందించాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.
This website uses cookies.