- ఈ వివరాల మీ కోసమే
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజేష్ బెంగళూరులో రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలని చూస్తున్నాడు. ఉత్తర బెంగళూరులో 1350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ ధరలు దాదాపు రూ.50 లక్షల వరకు ఉన్నాయి. 15 ఏళ్ల తర్వాత తన రిటైర్మెంట్ హోమ్ గా ఉపయోగించుకునేలా ప్లాట్ లో పెట్టుబడి పెట్టాలని.. లేదా తన పెట్టుబడికి మంచి రాబడి వస్తే విక్రయించాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్లాట్ కొనే ముందు ఏమేం అంశాలు ఆలోచించాలా అని పలువురిని వాకబు చేశాడు. మీరు కూడా బెంగళూరులో ప్లాట్ కొనాలని భావిస్తుంటే.. ఈ అంశాలు మీకు ఉపయోగపడతాయి.
బెంగళూరులోని ప్లాట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే కొనుగోలుదారులు స్థలం, భూమిని విక్రయించే డెవలపర్ రకం, ప్రాజెక్ట్ అందించే సౌకర్యాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా రియల్ ఆదాయం బాగుండటంతో కొనుగోలుదారులకు ప్లాట్లు ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మారాయి. బెంగుళూరులోని కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, విల్లాల కంటే ప్లాట్‌ల అభివృద్ధి గణనీయంగా పెరిగింది. కరోనా తర్వాత దేవనహళ్లి, కోరమంగళ, ఇందిరానగర్‌లకు సమీపంలోని భూముల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఉత్తర బెంగళూరులోని దేవనహళ్లి, హెన్నూరు, బాగలూరు, యలహంక శివార్లలో ప్లాట్ల ధరలు పెరిగాయి. తూర్పు ఐటీ కారిడార్‌లోని వైట్‌ఫీల్డ్, సరజ్‌పూర్ రోడ్, వర్తూర్, పానత్తూరు మరియు పరిసర ప్రాంతాలలో కూడా ధరలు పెరిగాయి. సబర్బన్ రైలు, పెరిఫెరల్ రింగ్ రోడ్, బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ వంటి రాబోయే మౌలిక సదుపాయాలు భూముల ధరల పెరుగుదలలో కీలంగా ఉన్నాయని చెబుతున్నారు.