- ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయం
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు అందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివరాలను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా వెల్లడించారు.
అందరికీ ఇళ్లు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తుందని సిసోడియా చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయాన్స్ డీడ్ అందజేస్తుందని వివరించారు. ఈ డీడ్ కింద పదేళ్ల అనంతరం సంపూర్ణ హక్కులు లభిస్తాయని తెలిపారు. పదేళ్ల తర్వాత లబ్ధిదారులకు వాటిని అమ్ముకునే హక్కు కూడా వస్తుందని పేర్కొన్నారు. అయితే, భూమి పొందిన లబ్ధిదారులు రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉచిత ఇంటి పట్టాలను ఒకసారి మాత్రమే జారీ చేసేలా మార్గదర్శకాలు రూపొందించినట్టు చెప్పారు. పట్టా అందుకున్న అనంతరం రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం ప్రారంభించాలని పేర్కొన్నారు. ‘ఉచిత ఇంటి స్థలాలు దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు మాత్రమే కేటాయిస్తారు. లబ్ధిదారులకు ఏపీలో ఎక్కడా కూడా ఇల్లు లేదా భూమి ఉండకూడదు. అలాగే ఇప్పటికే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా హౌసింగ్ పథకం కింద లబ్ధిదారులకు కూడా ఇది వర్తించదు’ అని సిసోడియా తెలిపారు.