మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద సూపర్ టెక్, ఆ సంస్థ డైరెక్టర్లకు చెందిన రూ.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ లో ఉన్న 25 ప్రాపర్టీలతోపాటు ఉత్తరప్రదేశ్ మీరట్ లోని మీరట్ మాల్ ను అటాచ్ చేసినట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాపర్టీల విలువ రూ.40.39 కోట్లు అని పేర్కొంది. తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల అమ్మకం పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన సూపర్ టెక్ సంస్థ
.. నిర్దేశిత గడువులోగా వాటిని అప్పగించడంలో విఫలమైందని ఈడీ వివరించింది. అంతేకాకుండా పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి కూడా రుణాలు పొంది.. ఈ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతరత్రా కార్యకలాపాలకు మళ్లించారని తెలిపింది. ఈ నేపథ్యంలో సూపర్ టెక్ సంస్థతోపాటు దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.