నిన్నటివరకూ ప్రజల సొంతింటి కలను హౌజింగ్ బోర్డు తీర్చేది. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని బట్టి ఈడబ్య్లూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అంటూ నాలుగు రకాల ఇళ్లను కట్టేది. కేపీహెచ్‌బీ వంటి అనేక కాలనీలను హౌసింగ్ బోర్డు నిర్మించింది. కానీ, దీన్ని పక్కన పెట్టేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలో రాజీవ్ స్వగృహ ఆరంభమైంది. పదేళ్లు దాటినా ఈ సంస్థ కట్టిన గృహాలు నగరవాసుల చేతికి అందలేదు. వేలం పాటలు వేసి స్థలాల ధరల్ని కృత్రిమంగా పెంచేసిన సంస్కృతి అంతకుముందే ఆరంభం కాగా.. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భవించాక కూడా కొనసాగుతోంది.
ఫలితంగా, ఈ వేలం పాటలే మధ్యతరగతి ప్రజానీకానికి సొంతింటిని మరింత భారం చేస్తోంది. పదేళ్ల క్రితం నాగోలులో పది లక్షలకే సొంతింటి కల సాకారం అయ్యేది. కానీ, హెచ్ఎండీఏ వేలం పాటల పుణ్యమా అంటూ గజం లక్ష రూపాయలు పలికింది. ఇలాగైతే, అక్కడి చుట్టుపక్కల భూముల ధరలు పెరగకుండా ఉంటాయా చెప్పండి? పోనీ, ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను సాకారం చేస్తుందా? అంటే అదీ లేదు. దీంతో గత ఏడేళ్ల నుంచి సామాన్యులు సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితికి చేరుకున్నారు.