Categories: TOP STORIES

అర‌బిందో రియాల్టీ ఎండీ లిక్క‌ర్ స్కాం.. ఫ్లాట్ల ర‌ద్దు యోచ‌న‌లో బ‌య్య‌ర్లు?

  • ఢిల్లీ మ‌ధ్యం కుంభ‌కోణంలో..
  • సౌత్‌ గ్రూపు, అరబిందో రియాల్టీ ఎండీ
    శరత్‌ చంద్రా రెడ్డి రూ. 600 కోట్లు పెట్టుబడి?
  • కోర్టుకు విన్న‌వించిన ఈడీ
  • ఈ నెల 20న బెయిల్‌పై విచార‌ణ‌
  • ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకుంటున్నారా?

అంద‌రి చూపు జ‌న‌వ‌రి 20 మీద‌ ప‌డింది. ఎందుకంటే అదే రోజు అర‌బిందో రియాల్టీ ఎండీ శ‌ర‌త్ చంద్రారెడ్డికి బెయిల్ వ‌స్తుందో లేదో తేలిపోతుంది. 2022 నవంబ‌రు 10న ఆయ‌న్ని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్నుంచి తీహార్ జైలులోనే మ‌గ్గుతున్నారు. సుమారు 69 రోజుల్నుంచి ఊచ‌లు లెక్క‌పెడుతున్న ఆయ‌నకు జ‌న‌వ‌రి 20న అయిన బెయిల్ వ‌స్తుందా? లేదా? అని అర‌బిందో గ్రూపుతో పాటు ఈ సంస్థ‌లో ఫ్లాట్లు కొన్న‌వారు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవ‌ల సీబీఐ కోర్టు జ‌రిపిన విచార‌ణ‌లో.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజ‌య్ నాయ‌ర్ ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క వ్య‌క్తి కాబ‌ట్టి, ఆయన‌కి బెయిల్ ఇవ్వొద్ద‌ని ఈడీ కోర్టును విజ్ఞ‌ప్తి చేసింది. బెయిల్‌కి సంబంధించిన తీర్పును కోర్టు జ‌న‌వ‌రి 20కి వాయిదా వేసింది. మొత్తానికి, ఈ రెండింటికి క‌లిపి జ‌న‌వ‌రి 20న తీర్పు వెలువ‌డే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. అలాగే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమీర్‌ మహేంద్రు బెయిల్‌ పిటిషన్‌ విచారణను నేటికి వాయిదా వేశారు. సౌత్‌ గ్రూపు, అరబిందో రియాల్టీ ఎండీ శరత్‌ చంద్రా రెడ్డి దాదాపు రూ. 600 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలియజేసిన విష‌యం తెలిసిందే.

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లి బెయిల్ దరఖాస్తుపై ఢిల్లీ కోర్టు గ‌త గురువారం వాద‌న‌ల్ని ముగించింది. నిందితుల తరఫు న్యాయవాది, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనల్ని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ విన్నారు. పి శరత్ చంద్రారెడ్డితో పాటు మరికొందరు సహ నిందితులు దాఖలు చేసిన ఇదే విధమైన పిటిషన్‌లపై ఉత్తర్వులతో పాటు బోయిన్‌పల్లి బెయిల్ దరఖాస్తుపై ఉత్తర్వులు ప్రకటిస్తామని తెలిపారు.

మ‌రోవైపు, ఈడీ సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీటుపై సీబీఐ స్పెషల్ కోర్టు జనవరి 28న నిర్ణయం తీసుకుంటుంది. సుమారు 13,567 పేజీల ఛార్జ్ షీటులో ఐదుగురు వ్యక్తులు, ఏడు సంస్థలపై అభియోగాలు మోపామ‌ని ఈడీ లాయర్ నవీన్ కుమార్ తెలిపారు. ఇందులో రాబిన్ డిస్టిల్లరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ (అర‌బిందో రియాల్టీ ఎండీ) శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రూ, ఆప్ కమ్యూనికేషన్ ఇన్ ఛార్జీ విజయ్ నాయర్, వ్యాపారవేత్త బినోయ్ బాబు, అమిత్ అరోరాల పేర్ల‌ను ప్ర‌స్తావించిన‌ట్లు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు.

ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేసుకుంటారా?

అర‌బిందో రియాల్టీ ఎండీ శ‌ర‌త్ చంద్రారెడ్డి అరెస్టై సుమారు అర‌వై తొమ్మిది రోజులైంది. అయితే, ఆయ‌న జైల్లో ఉన్నా.. అర‌బిందో రియాల్టీ ప్రాజెక్టుల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌లేద‌ని సంస్థ రుజువు చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో ప‌త్రిక‌ల్లో భారీ ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయ‌డంతో పాటు డిజిట‌ల్ మీడియాలోనూ ప్ర‌చార‌ జోరును పెంచింది. అయిన‌ప్ప‌టికీ, గ‌తంతో పోల్చితే ఈ సంస్థ‌ల ప్రాజెక్టుల్లో.. ఫ్లాట్ల‌ను కొన‌డానికి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పెద్ద‌గా ముందుకు రావ‌ట్లేద‌ని స‌మాచారం.

ఈ సంస్థ చేప‌ట్టిన ప్రాజెక్టుల్లో ఎవ‌రెవ‌రు ఎంతెంత పెట్టుబ‌డులు పెట్టార‌నే అంశంపై ఈడీ దృష్టి సారిస్తే త‌మ పేర్లు బ‌య‌టికొస్తాయ‌నే భయం ఇన్వెస్టర్లలో ఉన్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే అర‌బిందో ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్న‌వారు.. ఇందులో ర‌ద్దు చేసి.. వేరే ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాల‌నే ఆలోచ‌న‌లోనూ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇలాంటి వారిలో న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకే సంస్థ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఒక్క‌సారి కొనుగోలుదారుల న‌మ్మ‌కాన్ని పోగొట్టుకుంటే.. మళ్లీ నిల‌బెట్టుకోవ‌డం కష్టమే. మరి, ఈ స‌మ‌స్య‌ను అర‌బిందో రియాల్టీ ఎలా అధిగమస్తుందో?

This website uses cookies.