Categories: LATEST UPDATES

14 రోజులు సీబీఐ కస్టడిలోకి అరబిందో రియాల్టీ ఎండీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఊచలు లెక్క పెడుతోన్న అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రారెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడిని విధించింది. సోమవారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తిగా పరిగణించిన కోర్టు.. విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించింది. ఈ కేసును డిసెంబరు ఐదో తేదీకి వాయిదా వేసింది. ఇలాంటి కేసులో నిందితులకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వలేమని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ ముగిసిన తర్వాత ఈడీ అధికారులు నిందితుడిని తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీలోని ఎనిమిది సర్కిళ్లలో తమ బినామీలకు లిక్కర్ లైసెన్సులు పొందేందుకు.. సుధీర్ నాయర్ ద్వారా శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ డిప్యూటీ సీఎంకు రూ. 100 కోట్లు ముడుపులిచ్చారనేది శరత్ చంద్రారెడ్డిపై ప్రధాన అభియోగం.

* లంచం కేసులో ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేశారు కాబట్టి, అది సీబీఐ విచారణలో తేలితే.. ఆయన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ, ఇదే నిజమైతే.. అరబిందో రియాల్టీ మీద ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయంపై రియల్ రంగంలో జోరుగా చర్చ జరగుతోంది. ఇప్పటికే అరబిందో రియాల్టీలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఫ్లాట్లు రద్దు చేసుకుంటామని మార్కెటింగ్ సిబ్బందికి తెలియజేసినట్లు సమాచారం. ముఖ్యంగా, కొండాపూర్ రీజెంట్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్నవారిలో అధిక శాతం మంది ఈ చర్యకు ఉపక్రమిస్తున్నారని తెలిసింది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొహినూర్ ప్రాజెక్టు స్థాయిలో లేదు. ఇందులో ఫ్లాటును రద్దు చేసుకుని.. వేరే ప్రాజెక్టుల్లో తీసుకుందామని కొందరు భావిస్తున్నారని సమాచారం.

* నిన్నటి వరకూ అరబిందో రియాల్టీలో ఫ్లాట్లు కొన్నవారికి బ్యాంకులు పిలిచి మరీ రుణాల్ని మంజూరు చేసేవి. రుణమంజూరీలో ఎక్కడ్లేని ప్రాధాన్యతనిచ్చేవి. ఇందులో కొన్నవారికి.. మంచి ట్రాక్ రికార్డుంటే చాలు.. గృహ రుణాల్లో కొంత శాతం తక్కువ వడ్డీకే రుణాల్ని అందజేసేవి. కానీ, ఈ సంస్థ ఎండీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోవడంతో.. బ్యాంకులు ఈ కంపెనీకి ప్రాధాన్యతను ఇవ్వడం తగ్గించాయని సమాచారం. పైగా, శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాముకు సంబంధించి ఇచ్చిన రూ. 100 కోట్లు ఎక్కడ్నుంచి తెచ్చారు? అందుకోసం అరబిందో సంస్థ ఖాతా నుంచి సొమ్మును బదిలీ చేశారా? లేక హవాలాలో తరలించారా? అనేది సీబీఐ విచారణలో తేలే అవకాశముంది. ఒకవేళ అరబిందో ఖాతాలో నుంచి సొమ్మును తరలించారనే అంశం తేలితే.. ఈ సంస్థ చేపడుతున్న నివాస సముదాయాల ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.

This website uses cookies.