Categories: TOP STORIES

పంచాయతీ లేఔట్లలో రిజిస్ట్రేషన్లు చేయాలి

గ్రామ పంచాయతీ లేఔట్లలో మిగిలిపోయిన ప్లాట్లు.. హైకోర్టు ఆర్డరుతో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు.. జీపీఏ, ఏజీపీఏ ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రియల్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ సంఘ సభ్యులు కలిసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐ జి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఐజీకి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల కాలం నుండి గ్రామపంచాయతీ లేఔట్ లో రిజిస్ట్రేషన్లు కాక ఇటు యజమానులు అటు కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. నరసయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ లేఔట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత కారణంగా పలువురు రియాల్టర్లు అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ లేఔట్లలో కొనుగోలు చేసిన కస్టమర్లు తమ అవసరాలకు ప్లాట్లు అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద సబ్ రిజిస్టార్లకు వినతి పత్రాలు సమర్పించాలని, 29వ తేదీన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులకు వినతి పత్రాలు అందచేస్తామని, డిసెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు నరసయ్య వెల్లడించారు.

This website uses cookies.