గత వేసవిలో నీటి కోసం అల్లాడిన ఐటీ నగరం బెంగళూరు రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో మాత్రం అదరగొట్టింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 18,550 యూనిట్ల అమ్మకాలతో ప్రముఖ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా అవతరించింది. అలాగే కొత్త లాంచ్ లో 45 శాతం పెరుగుదలతో 16,537 యూనిట్లకు చేరిందని ప్రముఖ కన్సల్టెంట్ జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగం అభివృద్ధి చెందడంతోపాటు మౌలిక వసతులు మెరుగుపరిచే కార్యక్రమాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం కారణంగా బెంగళూరులో స్థిరమైన డిమాండ్ కొనసాగుతోందని.. ఫలితంగా అనేక జాతీయ, ప్రాంతీయ డెవలపర్లను ఈ నగరం ఆకర్షిస్తోందని జేల్ఎల్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అరోరా పేర్కొన్నారు.
కొత్త లాంచ్ లలో వైట్ ఫీల్డ్లో 47 శాతం ఉండగా.. తర్వాత హోసూర్ రోడ్, బళ్లారి రోడ్డు ఉన్నాయని వెల్లడించారు. కాగా, గత త్రైమాసికంలో జరిగిన అమ్మకాల్లో అప్పర్-మిడ్ సెగ్మెంట్ అపార్ట్ మెంట్లు (రూ. కోటి నుంచి రూ. 3 కోట్ల మధ్య ధర కలిగిన యూనిట్లు) 62 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆఫీస్ సెక్టార్ విస్తరించడం, మెట్రో పొడిగింపు కారణంగా రియల్ ఎస్టేట్ పరంగా వైట్ ఫీల్డ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని అరోరా వ్యాఖ్యానించారు. విమానాశ్రయానికి, వైట్ ఫీల్డ్ ను అనుసంధానించే కారిడార్ కారణంగా పలువురు డెవలపర్లు ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు ప్రారంభించుందుకు మొగ్గు చూపిస్తున్నారని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం రూ.కోటి నుంచి రూ.3 కోట్ల ధర కలిగిన ప్రాజెక్టులే ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో వచ్చిన అనరాక్ డేటాను చూస్తే..
అగ్ర నగరాల్లో అద్దె గృహాల డిమాండ్ బాగా పెరగడంతో, సగటు అద్దె విలువలు పెరిగాయి. ఇందులో కూడా బెంగళూరు 4.45 శాతం అద్దె ఆదాయంతో టాప్ లో ఉంది. కరోనా తర్వాత ఐటీ కంపెనీల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండటంతో బెంగళూరులోని కీలక ప్రాంతాలలో అద్దె విలువలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కోవిడ్ 2019కి ముందు బెంగళూరు అద్దె ఆదాయం 3.6%గా ఉంది. ఇది ఈ కాలంలో 24% వృద్ధిని సాధించింది.
This website uses cookies.