Categories: LATEST UPDATES

పండగ వేళ కళకళలు ఖాయమేనా?

  • ఈ మూడు నెలలపై బ్యాంకులు, బిల్డర్ల దృష్టి
  • వడ్డీ రేట్ల తగ్గింపు, రాయితీల ప్రకటన

కరోనా నేపథ్యంలో కాస్త ఒడిదొడుకులకు లోనైన రియల్ రంగం క్రమంగా గాడిన పడుతోంది. మిగిలిన రంగాల మాటెలా ఉన్నా.. రియల్ ఎస్టేట్ జోరందుకుంటోంది. సొంతిల్లు ఉండటం ఎంత ముఖ్యమైన విషయమో గతేడాది జరిగిన పరిణామాలను బట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. దీంతో చాలామంది సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పండగవేళపైనే అటు బ్యాంకులతోపాటు ఇటు బిల్డర్లు ప్రధానంగా దృష్టి సారించారు.

కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీ రేటు ఇస్తుండగా.. బిల్డర్లు ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటిస్తున్నారు. ఈ మూడు నెలల కాలంలో కొనుగోలుదారులు భారీగా ముందుకు వస్తారనే అంచనాల నేపథ్యంలో పలు బ్యాంకులు గృహరుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంకులు 6.5 శాతం నుంచి 6.7 శాతం వరకు మధ్య ఉన్న వడ్డీ రేట్లను 15 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గించాయి.

దశాబ్ద కాలంలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. కరోనా ప్రభావం చాలా బ్యాంకులపై ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో నమ్మకమైన రుణగ్రహీతలను ఆకర్షించడం ద్వారా తిరిగి గాడిన పడాలని అవి భావిస్తున్నాయి. ఇదే సమయంలో వృద్ధిని కాపాడటం కోసం బిలియన్ల డాలర్లను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పిస్తూ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం.. వడ్డీ రేట్ల తగ్గింపునకు దోహదపడింది.

ఇక బిల్డర్లు సైతం అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కొనుగోలుదారులకు రాయితీలతోపాటు బహుమతులు అందజేస్తున్నారు. అంతేకాకుండా వివిధ రకాల చెల్లింపు ప్రణాళికలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు కొన్నిరకాల ముందస్తు చెల్లింపులను వాయిదా వేస్తున్నారు. ఇది కొనుగోలుదారులకు అనుకూలంగా మారింది. గృహరుణాలు స్థిరంగా ఉండటం, పండగ ఆఫర్లు అందుబాటులో ఉండటం, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు ఇళ్ల అమ్మకాలకు దోహదపడతాయని ప్రధాన ఆర్థికవేత్త, జోన్స్ లాంగ్ లాసల్లే ఇంక్ ప్రాపర్టీ పరిశోధన సంస్థ అధిపతి సమంతక్ దాస్ పేర్కొన్నారు.

మొదటి ఆరునెలలతో పోలిస్తే ద్వితీయార్థంలో 30 నుంచి 35 శాతం మేర గృహ అమ్మకాలను పెంచడానికి ఈ పండుగ ఆఫర్లు ఉపయోగపడతాయని దాస్ అభిప్రాయపడ్డారు. ఇక వచ్చే మూడు నెలల్లో ఇల్లు కొనాలని భావిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు జేఎల్ఎల్ సర్వేలో తేలింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 2500 మందిపై అధ్యయనం నిర్వహించింది. వీరిలో దాదాపు 80 శాతం మంది తాము రాబోయే మూడు నెలల్లో ఇల్లు కొనాలని భావిస్తున్నట్టు చెప్పారు. 2022 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో డెవలపర్లు తమ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రికార్డు స్థాయిలో బుకింగులు పొందడం ఖాయమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈక్విటీ పరిశోధన నిపుణుడు ఆదిదేవ్ ఛటోపాధ్యాయ అభిప్రాయపడ్డారు.

This website uses cookies.