Categories: LEGAL

బ్యాంకులు ప్రాపర్టీ డీలర్లలా వ్యవహరించొద్దు

ఏపీ హైకోర్టు హితవు

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ నగదు వసూలు విషయంలో ప్రాపర్టీ డీలర్ల మాదిరిగా వ్యవహరించకూడదని ఏపీ హైకోర్టు హితవు పలికింది. ఇలాంటి అంశాల్లో చట్టబద్ధంగా న్యాయమైన పద్ధతిలో వ్యహరించాలని సూచించింది. ఓ ప్రాపర్టీ అమ్మకపు ఒప్పందంలో భాగంగా చెల్లించిన నగదును నిబంధనలకు విరుద్ధంగా జప్తు చేయడంపై కెనరా బ్యాంకు అధికారులను నిలదీసింది.

2019లో కెనరా బ్యాంకు వేసిన ఓ వేలంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సయ్యద్ హిదయతుల్లా పాల్గొన్నారు. అందులో ఆయన బిడ్ ఆమోదం పొందింది. నిబంధనల ప్రకారం 25 శాతం మొత్తాన్ని వేలం సమయంలోనే చెల్లించారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల మిగిలిన మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోయారు. ఇదే విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెల్లింపు గడువును బ్యాంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వేలం వేసిన భూమికి సంబంధించి కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని హిదయతుల్లా బ్యాంకును కోరారు.

వేలం నోటీసులో పెట్టిన విస్తీర్ణం కంటే భూమి విస్తీర్ణం తక్కువ ఉందని పేర్కొన్నారు. అలాగే భూమి ఎలాంటి ఆకృతిలో ఉందో కూడా బ్యాంకు తెలియజేయలేదని.. రెండు పెద్ద భవంతుల మధ్య నుంచి సన్నదారి మాత్రమే ఉందని తెలిపారు. ఈ అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయన నిర్దేశిత గడువులోగా మరో రూ.15 లక్షలు చెల్లించారు. అయితే, బ్యాంకు మాత్రం నిర్దేశిత గడువులోగా సొమ్ము చెల్లించనందుకు ఆ మొత్తాన్ని జప్తు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా వేలం వేసిన భూమికి సంబంధించిన అసలు యజమానితో ఒన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకుని వేలంలో వచ్చిన మొత్తం కంటే తక్కువకు ఆ భూమిని అతడికి ఇచ్చేసింది. దీంతో హిదయతుల్లా కోర్టుకెళ్లారు.

చెల్లింపు గడువు కంటే ముందుగానే బ్యాంకు అతడితో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవడం చట్టవిరుద్ధమని ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు వాదనలు విన్నారు. నిర్దేశిత గడువులోగా సొమ్ము కట్టనందుకు ఆ మొత్తాన్ని జప్తు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుందని కెనరా బ్యాంకు వాదించింది. అయితే, దీంతో న్యాయమూర్తి విభేదించారు. చెల్లింపు గడువు తర్వాతే ఆ అధికారం బ్యాంకుకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ సొమ్ము తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించారు.

This website uses cookies.