– గతేడాది 49 శాతం అధిక విక్రయాలతో రెండో స్థానం
– దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లోనూ జోరుగా ఇళ్ల అమ్మకాలు
– ప్రాప్‌టైగర్ డాట్ కామ్ నివేదిక వెల్లడి
రియల్ రంగంలో గతేడాది మన హైదరాబాద్ అదరగొట్టింది. 2023లో ఇళ్ల అమ్మకాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం విక్రయాలు పెరిగాయి. 2022లో హైదరాబాద్‌లో 35,372 ఇళ్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2023లో 52,571 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్ తర్వాత అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైనట్టు ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ వెల్లడించింది. 2023 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 20,491 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 14,191 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి నమోదైంది. 2022 చివరి త్రైమాసికం విక్రయాలు 10,335 యూనిట్లతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది 4.10 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది గణాంకాలతో పోలిస్తే ఇది 33 శాతం అధికం.
* ఇళ్ల సరఫరా విషయానికి వస్తే హైదరాబాద్ లో గతడాది కొత్త ఇళ్ల సరఫరా 2022తో పోలిస్తే 7 శాతం తగ్గింది. 2022లో 82,801 యూనిట్లు అందుబాటులోకి రాగా, 2023లో 76,819 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా నూతన ఇళ్ల సరఫరా ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. 2022లో 4,31,510 కొత్త ఇళ్ల యూనిట్లు ప్రారంభం కాగా, 2023లో 5,17,071 యూనిట్లు ఆరంభమయ్యాయి. 20 శాతం వృద్ధి కనిపించింది. వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ అనిశ్చితులు, ఇళ్ల ధరలు పెరుగుదల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, గతేడాది రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ పనితీరు చూపించిందని, కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో ప్రాపర్టీ మార్కెట్ అసాధారణ స్థాయికి చేరుకుందని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాధ్వాన్ పేర్కొన్నారు. ధరలు పెరగడంతో బడ్జెట్ ఇళ్ల (అఫర్డబుల్) విభాగం సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు.
This website uses cookies.