Categories: LATEST UPDATES

రియల్ బూమ్ లో హైదరా‘బాద్ షా’

– వచ్చే మూడేళ్లలో 1.30 లక్షల యూనిట్ల లాంచ్
– సీబీఆర్ఈ నివేదిక అంచనా

రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ బూమ్ కొనసాగనుంది. వచ్చే మూడేళ్లలో నగరంలో 1.30 లక్షల కొత్త యూనిట్లు లాంచ్ అవుతాయని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. సాంకేతిక రంగ, పారిశ్రామికీకరణలో హైదరాబాద్ విస్తరణ రెడిడెన్షియల్ డెవలప్ మెంట్ కు ఉత్ప్రేరకంగా మారుతుందని పేర్కొంది. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో అభివృద్ధి మరింతగా ఉంటుందని అంచనా వేసింది. మిడ్ సెగ్మెంట్, హై ఎండ్, ప్రీమియం కేటగిరీల ఇళ్లతో పశ్చిమ హైదరాబాద్ ప్రాధాన్య నివాస కేంద్రంగా కొనసాగుతుందని పేర్కొంది. అదే సమయంలో నార్త్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్ లోని మైక్రో మార్కెట్లు మిడ్ సెగ్మెంట్ ఇళ్ల కొనుగోలుదారులను ఆకర్షిస్తాయని తెలిపింది. సెంట్రల్ హైదరాబాద్ ప్రధానంగా హై ఎండ్, ప్రీమియం సెగ్మెంట్లలో డిమాండ్ ను నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడింది.

కొనుగోలుదారులు ప్రధానంగా రూ.45 లక్షల నుంచి రూ.కోటి, రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల మధ్య పరిధిలో ఉండే ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. పెరుగుతున్న భూముల ధరలతోపాటు నానాటికీ పెరుగుతున్న డెవలప్ మెంట్ ఖర్చుల కారణంగా పెద్ద సైజు ఇళ్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. డెవలపర్లు కీలకమైన మైక్రో మార్కెట్లలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండగా.. డెలివరీ టైమ్ లైన్ లు, నిర్వహణ సామర్థ్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఆఫీస్ సెక్టార్ లో 2025 నాటికి 35 నుంచి 38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ లోని ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ బిజినెస్ పార్కులు పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.

This website uses cookies.