భారతీ బిల్డర్స్ ప్రీలాంచుల్లో భాగంగా ఎనభై కోట్లను వసూలు చేసిందని తొలుత పోలీసులు ప్రకటించారు. కానీ, రియల్ ఎస్టేట్ గురు సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ భారతీ బిల్డర్స్ చేసిన మోసం విలువ ఎంతలేదన్నా రూ.280 కోట్ల దాకా ఉంటుందని అంచనా. రేటు తక్కువనగానే ప్రజలు తెచ్చి అడ్వాన్సులు చెల్లిస్తుండటం.. తక్కువ రేట్లలో ఫ్లాట్లలో కొనేలా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేయడంతో.. సామాన్యులు అది నిజమేనని నమ్మేశారు. అందులో పెట్టుబడి పెట్టి.. తమ కష్టార్జితాన్ని వృథా చేసుకున్నారు. కొంపల్లి, భానూరు, పెద్దాపూర్, వెలిమల, గచ్చిబౌలి వద్ద కాందిశీకుల భూమి.. ఇలా భారతీ బిల్డర్స్ ప్రతిచోటా ప్రీలాంచులు చేసి.. జనాల వద్ద డబ్బులు వసూలు చేశారు. మరి, ఆ సొమ్మంతా ఏం చేశారో? ఎవరికి చెల్లించారో సంస్థ ఎండీ శివరామకృష్ణకే తెలుసని బాధితులు అంటున్నారు. ఈ సొమ్ముతో గోవాలో కొంత ఇన్వెస్ట్ చేశారని.. ఇతర ప్రాంతాల్లో భూములు కొన్నారని చెబుతున్నారు.
ఎవరి దగ్గర పడితే వారి దగ్గర ప్రీలాంచుల్లో కొనొద్దని రియల్ ఎస్టేట్ గురు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉంది. కేవలం రేటు చూసి టెంప్ట్ కావొద్దని.. బిల్డర్ ఫ్లాటును సకాలంలో అందజేస్తాడా? లేదా? అనే అంశాన్ని చూశాకే.. కొనుగోలు చేయాలని చెబుతూనే ఉంది. రెరా అనుమతి ఉంటే బెటర్ అని అంటూనే ఉంది. అయినా కూడా కొందరు చదువుకున్న మూర్ఖులు.. రేటు తక్కువనే కారణంతో.. ప్రీలాంచుల్లో ఫ్లాట్లు కొనడం.. ఆతర్వాత మోసపోవడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. సాహితి, జయా గ్రూప్, మైత్రీ, భువనతేజ, ఫార్చ్యూన్ 99 హోమ్స్, జేవీ బిల్డర్స్ తాజాగా భారతీ బిల్డర్స్.. అమాయక ప్రజల నెత్తిన శఠగోపం పెట్టారు. సుమారు 280 కోట్ల వసూలు చేసి చేతులెత్తేశారు. మరి, ఆ సొమ్మంతా ఏం చేశారో? ఎవరికిచ్చారో.. పోలీసులే చెప్పాలి. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. ప్రీలాంచుల్లో కొనకండి.. మోసపోకండి.
This website uses cookies.