భువనతేజ ఇన్‌ఫ్రా ఎండీ సుబ్రమణ్యం.. గతంలో ఎప్పుడూ అపార్టుమెంట్లను కట్టింది లేదు.. పారిజాత డెవలపర్స్‌లో ప్లాట్లు మాత్రమే విక్రయించాడు. అలాంటిది, శామీర్‌పేట్‌లో పదహారు లక్షలకే ఫ్లాట్లంటే ఎగిరి గంతేశారు. ఫ్లాట్ల నిర్మాణంలో సిమెంటు, స్టీలు నిష్పత్తి ఎంతుంటుందో కూడా తెలియని ఈ మహానుభావుడు బిల్డర్‌గా అవతారమెత్తి.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన ఈ వ్యక్తి జీఎస్టీ ఎప్పట్నుంచి కడుతున్నాడనే విషయాన్ని అధికారులు ఆరా తీయాలి.
ఎంత మంది కొనుగోలుదారుల నుంచి లక్షల రూపాయల్ని దండుకున్నాడో తెలుసుకోవాలి. ఎన్ని అపార్టుమెంట్లను కడతానని ప్రజలకు హామీ ఇచ్చాడు? వాటి ప్రస్తుత నిర్మాణ పరిస్థితి ఏమిటి? ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనే విషయాన్ని కనుక్కోవాలి. ప్రజల్నుంచి వసూలు చేసిన సొమ్ముపై ఇంతవరకూ జీఎస్టీ ఎంతవరకూ చెల్లించాడో తెలుసుకోవాలి. మొత్తానికి సాహితీ, జయ గ్రూప్ తరహాలో మరో మోసం నగరంలో జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా వ్యవహరించాలి.
భువనతేజ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన సుబ్రమణ్యం గతంలో రాజమండ్రిలో ఐపీ పెట్టాడని సమాచారం. అతను కొంతకాలం నగరానికి విచ్చేసి పారిజాత డెవలపర్స్‌లో ప్లాట్లను విక్రయించాడు. ఆతర్వాత ప్రీలాంచ్ మజాను తెలుసుకుని శామీర్‌పేట్‌లో చౌక ధరకే ఫ్లాట్ల పేరిట అమాయకుల నుంచి సొమ్ము దండుకున్నాడు. ఇతను రేపొద్దున అపార్టుమెంట్లను నాణ్యతతో సకాలంలో అందిస్తాడనే నమ్మకం లేకపోవడంతో చాలామంది తమ సొమ్మును వెనక్కి ఇవ్వమని సంస్థ చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడానికీ సిద్ధమయ్యారని సమాచారం. భార్య పేరిట కంపెనీ పెట్టి.. ఇతనే చెక్కుల మీద సంతకాల్ని పెడుతూ.. ఏజెంట్లకు భారీ కమిషన్లను ముట్టచెబుతూ.. అమాయకులకు నిత్యం గాలం వేస్తూ.. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న సుబ్రమణ్యం అపార్టుమెంట్లను ఎప్పుడు పూర్తి చేస్తాడనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
This website uses cookies.