(కింగ్ జాన్సన్ కొయ్యడ)
రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్ మెట్రో రైలుకు శంకుస్థాపన చేసినప్పుడే.. బుద్వేల్‌లో ప్రభుత్వం భారీ స్థాయిలో భూముల్ని విక్రయించడానికి ప్రణాళికలు రచిస్తోందని.. వేలం పాటల నిర్వహణ ద్వారా కోట్ల రూపాయల్ని సమీకరించే ప్రయత్నం చేస్తుందని రియల్ ఎస్టేట్ గురు మొదట్లోనే చెప్పింది. వెయ్యి ఎకరాల వేలం.. 40 వేల కోట్ల సమీకరణే లక్ష్యం కథనాన్ని గత డిసెంబరులో ప్రచురించింది. అక్కడి చెరువును చూపెట్టి భూముల్ని మార్కెటింగ్ చేయనున్నదని కథనంలో పేర్కొన్నట్లుగానే.. ఈ వెంచర్ కు హెచ్ఎండీఏ లేక్ సిటీ అని నామకరణం చేసింది.
హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ ప్రణాళికల గురించి ప్రప్రథమంగా.. సాగర తీరంలో సరికొత్త అభివృద్ధి అనే శీర్షికతో ఫిబ్రవరి 25న ప్రత్యేక కథనాన్ని రియల్ ఎస్టేట్ గురు పాఠకుల ముందు ఉంచింది. రెజ్ న్యూస్ చెప్పినట్లే.. హెచ్ఎండీఏ బుద్వేల్‌లో ప్రభుత్వం భూముల విక్రయానికి శ్రీకారం చుట్టింది. తొలుత 182 ఎకరాల్ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తారని హెచ్ఎండీఏ చెబుతోంది. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 6.13 నుంచి 14.58 ఎకరాల దాకా ఉంటుంది. మొత్తం కలిపితే 60.08 ఎకరాలు అవుతోంది. ఈ క్రమంలో తొలుత ఏడు ప్లాట్లను విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. 283/పి, 284/పి, 287/పి, 288/పి, 289, 290, 291, 292, 293, 294, 205, 296, 297, 298, 299/పి సర్వే నెంబర్లలో ఈ భూమి ఉంది.
ఈ లేఅవుట్లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడానికే ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందుకోసం ఎంతలేదన్నా 18 నెలలు పడుతుంది. ఈ లేఅవుట్‌ని అత్యంత ఆధునిక రీతిలో డెవలప్ చేసేందుకు హెచ్ఎండీఏ అడుగులు ముందుకేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తోంది.
This website uses cookies.