(రెజ్ న్యూస్ టాస్క్‌ఫోర్స్ )
తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి రమేష్ బ్రతుకుదెరువు కోసం నగరానికొచ్చాడు. చదువుకుంది తక్కువే అయినా కష్టించే మనస్తత్వం. ముందుగా ఒక హోటల్‌లో పనికి కుదిరాడు. తర్వాత స్థానిక కంపెనీలో చేరి.. సూపర్‌వైజర్ స్థాయికి ఎదిగాడు. సొంతంగా అద్దె ఇల్లు తీసుకుని వృద్ధ తల్లీదండ్రులను, ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తున్నాడు. పదేళ్ల కష్టార్జితంతో పదిహేను లక్షలు కూడబెట్టాడు. కుటుంబ సంతోషం కోసం పరితపించే రమేష్.. ఓ ఏజెంట్ ద్వారా రూ.12 లక్షలకే సొంతిల్లు వస్తుందని తెలుసుకున్నాడు. అతని మాటల్ని నమ్మేసి.. ఇంట్లో ఉన్న సొమ్మును తీసుకెళ్లి బిల్డర్ చేతిలో పోశాడు. మూడేళ్లలో తమకంటూ ఓ సొంత గూడు వస్తుందనే ఆశతో కాలం వెళ్లదీశాడు. నగరంలో సొంతిల్లుంటే చెల్లెళ్లకు పెళ్లి చేద్దామని భావించాడు.
బిల్డర్‌కు డబ్బిచ్చి ఏడాదయ్యింది. ఏజెంటును అడిగితే అనుమతుల దశలో ఉందన్నాడు. రెండేళ్లయినా సంస్థ నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. ఎంతో ఉత్సాహంగా ఉండే రమేష్‌లో అలజడి మొదలైంది. కడ్తాల్ కాస్త దూరమైనా సొంతిల్లుంటే చాలని భావించిన అతను సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఐదారు బృందాల్లో ప్రజలు సొమ్ము కోసం కూర్చోవడం చూసి ఒక్కసారి షాకయ్యాడు. అక్కడి పరిస్థితిని చూసి ఏజెంటును నిలదీశాడు. కోపంతో కొట్టబోయాడు కానీ చివర్లో తన సొమ్ము గుర్తుకొచ్చి ఆగిపోయాడు.
ఇక లాభం లేదనుకుని.. సంస్థ ఎండీని కలిసేందుకు ఉదయం వెళితే దాదాపు సాయంత్రమయ్యేది. ఒంటి నిండా బంగారం వేసుకున్న ఆ బిల్డర్‌ను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఎంతో నమ్మశక్యంగా అనిపించేలా అతని మాటల్ని వింటుంటే నిజమేనని నమ్మాల్సిందే. కాకపోతే, రమేష్ రెండేళ్ల నుంచి అదే పనిగా వింటున్నాడు కాబట్టి.. ఇక ఆ బిల్డర్ మాటల్ని పట్టించుకోవద్దన్న నిర్ణయానికొచ్చాడు. తన ఇంటి గురించి నిలదీశాడు. అనుమతులు రాకపోవడంతో అపార్టుమెంట్ నిలిపివేశానని బిల్డర్ సులువుగా చెప్పగానే.. ఒక్కసారిగా భూమి కంపించినంత పనయ్యింది.
తను ఎన్ని కలలు కన్నాడు? తన కుటుంబానికో నీడ దొరుకుతుందని పరితపించాడు. సొమ్మంతా తీసుకెళ్లి అతని చేతిలో పోశాడు.. చివరికీ జబ్బు పడ్డ తల్లిని మంచి డాక్టరుకు చూపించలేకపోయానని బాధపడ్డాడు. బిల్డర్ చుట్టూ తిరిగీ తిరిగీ.. అతను చెప్పే మాటలు వినీవినీ విసిగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఎవరికీ చెప్పాలో తెలియక.. మానసిక వేదనకు గురయ్యాడు. తాను ఒంటరిగా బిల్డర్‌ని ఎదుర్కోలేననే బాధతో.. చివరిగా అతనికో వాట్సప్ మెసేజ్ పంపాడు. మీరు నా డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. నేను చనిపోతే, నేను కట్టిన రూ. 13 లక్షలకు మా తల్లిండ్రులకు ఇవ్వు. అదొక్క సహాయం మాత్రం చేసిపెట్టు అంటూ మెసేజ్ పెట్టాడు.
భువనతేజ ఇన్‌ఫ్రా సంస్థ వద్ద ఫ్లాట్లు కొన్నవారిలో ఎవరిని కదిలించినా ఒకటే కథ. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ. హ్యాపీ హోమ్స్ అంటే సంతోషంగా ఉంటామని భావించారు తప్ప ఇంత కుమిలిపోతామని భావించలేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ 2020లో హ్యాపీ హోమ్స్ అనే ప్రాజెక్టును కడ్తాల్‌లో ఆరంభించగా.. చాలామంది ఫ్లాట్లు బుక్ చేశారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. అది ఎందుకు రద్దయ్యిందో ఎవరికీ తెలియదు. ఇన్నేళ్లు గడిచినా అందులో ఫ్లాట్లు బుక్ చేసినవారికీ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. దీంతో, కొనుగోలుదారులంతా లబోదిబోమంటున్నారు.
This website uses cookies.