అతనొక పెద్ద మాయగాడు.. అంతకుమించిన మోసగాడు.. కరోనా సమయంలో సేల్స్ ఏజెంటుగా ప్రస్థానం మొదలెట్టి.. కొన్నాళ్లకే రియల్టర్‌గా అవతారమెత్తాడు. నగరం నలువైపులా వెంచర్లను ఆరంభించాడు. పది లక్షలకే ఫ్లాటు.. పదహారు లక్షలకే లగ్జరీ ఫ్లాటంటూ.. ఏజెంట్లకు అధిక కమిషన్ల ఆశచూపెట్టి.. వందలాది మంది బయ్యర్ల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేశాడు. నిర్మాణాల్ని కట్టడం బ్రోచర్లలో చూపెట్టినంత సులువు కాదని తెలుసుకున్నాడు.
బయ్యర్ల నెత్తి మీద శఠగోపం పెట్టడం ఆరంభించాడు. అతని అక్రమ అమ్మకాల లీలలు రియల్ ఎస్టేట్ గురు ఒక్కొక్కటిగా వెలుగులోకి తేవడంతో ఏం చేయాలో అర్థం కాకుండా.. ఇప్పుడో సరికొత్త అక్రమానికి తెరలేపాడు. కాబట్టి, బయ్యర్లు జాగ్రత్త. ఇప్పటికే వందలాది కొనుగోలుదారుల వద్ద నుంచి కోట్ల రూపాయల్ని దండుకున్న ఈ భువనతేజ ఇన్‌ఫ్రా మాయలో మరోసారి పడొద్దు.
హైదరాబాద్‌లో డజనుకు పైగా ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని ప్రారంభించి.. కోట్లాది రూపాయల్ని వసూలు చేసి.. నిర్మాణ పనుల్ని ఆరంభించకుండా.. కొనుగోలుదారులతో ఆటాడుకుంటున్న భువనతేజ ఇన్‌ఫ్రా యజమాని కొత్త ఎత్తుగడ వేశాడు. భువనతేజ ఇన్‌ఫ్రా అంటే ప్రీలాంచుల్లో కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదని అర్థం చేసుకున్న చక్కా వెంకట సుబ్రమణ్యం.. సరికొత్త సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రణవ రియల్టర్స్ ఇండియా ఎల్ఎల్‌పీ ( https://pranavagroup.in/) అని పేరు పెట్టింది. ఈ కొత్త సంస్థలో చక్కా భాగ్య, వెంకట్ అనే వారి పేర్ల మీద సంస్థను మొదలెట్టాడు. ప్రణవగ్రూప్.ఇన్ సైటును ఏర్పాటు చేసి పలు ప్రాజెక్టుల వివరాల్ని పొందుపరిచాడు. అయితే, వాటి వివరాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.
ప్రణవ డైమండ్ అనే ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రణవ గ్రూప్ వెబ్‌సైటు (https://pranavagroup.in/index.php/pranava-diamond/)లో పొందుపరిచాడు. ఈ సైటులోకి వెళ్లి బ్రోచర్‌ను డౌన్‌లోడ్ చేసి చూస్తే వచ్చే రెరా నెంబరు ఏ సంస్థదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రెరా నెంబరు ప్రజల నెత్తి మీద శఠగోపం పెట్టిన జయగ్రూప్ ప్రగతి నగర్‌లో ప్రారంభించిన అపార్టుమెంట్ రెరా నెంబరు కావడం విశేషం. అంటే, ఒక దొంగకు మరో గజదొంగ తోడైనట్లుగా ఉందీ వ్యవహారమని చెప్పొచ్చు. ఇప్పటికే జయగ్రూపు ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి అనేకమంది ప్రజలు దారుణంగా మోసపోయిన విషయం తెలిసిందే.
ఆయా సంస్థ యజమానిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి విధితమే. మరి, అలాంటి జయగ్రూప్ ప్రాజెక్టుకు సంబంధించిన రెరా నెంబరును ఈ చక్కా వెంకటసుబ్రమణ్యం వాడుకోవడమేమిటి? ఈ అంశంపై తెలంగాణ రెరా అథారిటీ లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, ఇప్పటికే జయగ్రూప్ ఎండీ ప్రజల నెత్తి మీద శఠగోపం పెట్టాడు. మళ్లీ అదే సంస్థకు చెందిన రెరా ప్రాజెక్టు నెంబరును అడ్డం పెట్టుకుని చక్కా వెంకట సుబ్రమణ్యం కొనుగోలుదారుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.
This website uses cookies.