Categories: TOP STORIES

కొత్త ఏడాది జోరు కొనసాగేనా?

మరో వారం రోజుల్లో కొత్త ఏడాది వచ్చేస్తుంది. కరోనా తర్వాత బాగానే కుదుటపడిన రియల్ రంగం 2023లో మంచి ఫలితాలే సాధించింది. ఎక్కడా తగ్గకుండా జోరుగా దూసుకెళ్లింది. మరి కొత్త సంవత్సరంలోనూ ఇదే జోరు కొనసాగుతుందా? స్తిరాస్థి మార్కెట్ అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దామా?

కరోనా సమయంలో కాస్త ఒడుదొడుకులకు లోనైన మన రియల్ రంగం.. క్రమంగా పుంజుకుంది. కరోనా నేర్పిన పాఠాలతో జనం సొంత, విశాలమైన ఇళ్లకు మొగ్గు చూపడంతో ట్రెండ్స్ కూడా మారాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఇళ్ల కొనుగోలు సెంటిమెంట్ బాగా పని చేసింది. దేశవ్యాప్తంగా 2.3 లక్షల యూనిట్లు, రూ.4.5 లక్ష కోట్ల మేర విలువైన అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఇది 3 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పదేళ్లలో ఇదే గరిష్ట స్థాయి కావడం విశేషం. ఇదే హవా 2024లోనూ కొనసాగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుబాటు ధరల ఇళ్లతోపాటే మధ్యశ్రేణి ఇళ్ల ప్రాజెక్టులకు డిమాండ్ ప్రస్తుతం ఉన్నట్టే ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు అంతకంటే ఎక్కువ ఖరీదైన ప్రీమియం ప్రాజెక్టుల్లోనూ వృద్ధి కొనసాగుతుందని అంచనా. వీటికి తగ్గట్టుగానే కొత్త లాంచింగులూ కూడా ఉంటాయని, ప్రముఖ డెవలపర్లు తమ పోర్ట్ ఫోలియోనే విస్తరిస్తారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ వెల్లడించింది.

వాస్తవానికి వడ్డీ రేట్లు ప్రతిబంధకంగా ఉన్నా.. ధరలు పెరిగినా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్లు గణనీయంగా అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే 5 శాతం వృద్ధి కనిపించింది. ముఖ్యంగా ప్రీమియం కేటగిరీలో 70 శాతం పెరుగుదల ఉండటం విశేషం. అధిక ఆదాయ వ్యక్తులు, ప్రవాస భారతీయులు వీటి వైపు మొగ్గు చూపించడంతో ఈ కేటగిరీలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ లో సైతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. విలాసవంతమైన, విశాలంగా ఉండే ఇళ్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు.

కార్యాలయానికి దగ్గర్లో ఉండేలా, వర్క్ ఫ్రం హోమ్ కోసం అనువుగా ఉండే ఇళ్లనే ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యం, భద్రత, సామాజిక అంశాలు, హరిత ఇళ్లు, స్మార్ట్ హోమ్ వంటివి కీలకంగా మారాయి. తాము ఎంచుకున్న ఇంట్లో అన్ని సౌకర్యాలూ, వసతులూ ఉన్నాయో లేవో పరిశీలించుకుంటున్నారు. ఈ విషయంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, కాస్త కష్టపడైనా అన్ని వసతులూ ఉన్న, తాము కోరుకున్న ఇంటికే జనం ఓటేస్తున్నారు. ఈ క్రమంలో 2024లో కూడా రియల్ రంగం జోరు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని.. వచ్చే ఏడాది కూడా ఇదే ఒరవడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

This website uses cookies.