కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఒడుదొడుకులకు లోనైన రియల్ ఎస్టేట్ రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 943 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనం. ఇందులో ఆఫీస్ స్పేస్ కు సంబంధించిన పెట్టుబడులే అగ్రస్థానంలో ఉన్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది.
సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఇవి 41 శాతం పెరగ్గా.. ఏడాది లెక్కన చూస్తే తొలి త్రైమాసికంలో 25 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో 16 ఒప్పందాలు జరగ్గా.. ఈ ఏడాది 10 ఒప్పందాలు మాత్రమే జరిగాయని వివరించింది. అయితే, ఈ ఏడాది భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని, రాబోయే త్రైమాసికాల్లో ఇవి పూర్తవుతాయని అంచనా వేసింది.
విదేశీ పెట్టుబడిదారులు వాణిజ్యపరమైన ఆస్తులపైనే ప్రధానంగా దృష్టి సారించారని, లీజింగ్ వ్యవహారాలు మళ్లీ రావడంతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరిగిందని పేర్కొంది. రిటైల్ రంగంలో కూడా ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయని జెఎల్ఎల్ క్యాపిటల్ మార్కెట్స్ ఇండియా ఎండీ లతా పిల్లై తెలిపారు. ఈ త్రైమాసికంలో జరిగిన లావాదేవీల్లో 492 మిలియన్ డాలర్ల మేర ఆఫీస్ స్పేస్ కి సంబంధించినవే ఉన్నాయని.. మొత్తం పెట్టుబడుల్లో ఇది 52 శాతం అని జేఎల్ఎల్ నివేదిక పేర్కొంది. ఇక రిటైల్ సెగ్మెంట్ వాటా 27 శాతం ఉన్నట్టు వివరించింది. ఇక రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో ఇది కాస్త తగ్గినట్టు తెలిపింది. ఇక మొత్తం పెట్టుబడుల్లో 42 శాతంతో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. 39 శాతంతో బెంగళూరు, 14 శాతంతో చెన్నై తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
This website uses cookies.