నిర్దేశిత గడువులోగా ఫ్లాట్ అప్పగించకుండా జాప్యం చేసిన బిల్డర్ కి జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్ సీడీఆర్సీ) షాక్ ఇచ్చింది. అధికారుల నుంచి అనమతులు రావడం ఆలస్యం కావడంతోనే నిర్మాణానికి సమయం పట్టిందంటూ బిల్డర్ చేసిన వాదన సహేతుకం కాదని తేల్చి చెప్పింది.
‘సంబంధిత అధికారుల నుంచి అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతుందనేది సాధారణమైన అంశమే. ఈ కారణాన్ని బిల్డర్ తనకు అనుకూలంగా చేసుకోవడానికి వీలుకాదు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారించడానికి ఇతర అంశాలేవీ మాకు కనిపించడo లేదు. అందువల్ల దీనిని తోసి పుచ్చుతున్నాం’ అని స్పష్టం చేసింది. అంతేకాకుండా నిర్మాణంలో జాప్యం జరిగినందుకు ఫ్లాట్ కొనుగోలుదారులు 9 శాతం వడ్డీతో పాటు పరిహారం పొందడానికి అర్హులని పేర్కొంది.
ఈ నేపథ్యంలో అనుజ్, సోమర బిశ్వాస్ లకు రూ.63 లక్షల వడ్డీతోపాటు రూ.1.17 కోట్లను తిరిగి చెల్లించాలని క్యాప్ స్టోన్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఆదేశించింది. 2013లో ఈ కంపెనీ థానేలో చేపట్టిన రుస్తోంజీ అర్బనియా అజ్జియానో ప్రాజెక్టు 12వ అంతస్తులో 750 చదరపు అడుగుల ఫ్లాట్ ను అనుజ్, సోమర బిశ్వాస్ దంపతులు రూ.1.32 కోట్లకు కొనుగోలు చేశారు. బ్యాంకు రుణం, ఇతర మార్గాల ద్వారా 90 శాతం మొత్తాన్ని చెల్లించారు.
ఒప్పందం ప్రకారం 2015 డిసెంబర్ 31 నాటికి ఫ్లాట్ అప్పగించాలి. గరిష్టంగా మరో ఆరునెలల సమయం అదనంగా తీసుకోవడానికి వీలవుతుంది. అయితే, బిల్డర్ ఏడాది ఆలస్యంగా 2016 డిసెంబర్ లో ఫ్లాట్ అప్పగించారు. అయితే, అందుకు బిశ్వాస్ దంపతులు అంగీకరించలేదు. తాము చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో తిరిగి ఇవ్వాలని కోరారు. బిల్డర్ నిరాకరించడంతో ఎన్ సీ డీఆర్సీని ఆశ్రయించారు.
This website uses cookies.