దేశంలో రియల్ రంగం జోరుగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది భారీగా ఇళ్లు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది మొత్తం ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 38 శాతం అధికంగా నమోదయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది. వీటి విలువ రూ.4.5 లక్షల కోట్ల పైమాటేనని పేర్కొంది. లగ్జరీ ఇళ్లకు అధిక డిమాండ్ ఉందని వివరించింది.
2022లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.3.26 లక్షల కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో అమ్మకాలే 7 శాతం వృద్ధితో రూ.3.49 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నగరాలవారీగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇళ్ల అమ్మకాల విలువ గతేడాది ఇదే కాలంతో చూస్తే.. 43 శాతం పెరిగి రూ.35,802 కోట్లుగా నమోదైంది. పుణెలో 96 శాతం వృద్ధితో రూ.39,945 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి. చెన్నై విషయానికొస్తే 45 శాతం పెరుగుదలతో రూ.11,374 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. బెంగళూరు మార్కెట్లో అమ్మకాల విలువ 42 శాతం పెరిగి రూ.38,517 కోట్లుగా ఉంది. ముంబైలో 41 శాతం వృద్ధితో రూ.1,63,924 కోట్ల విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 29 శాతం వృద్ధితో రూ.50,188 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. కోల్ కతాలో ఇళ్ల అమ్మకాలు 19 శాతం వృద్ధితో 9,025 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఇళ్ల ధరలు కూడా బాగానే పెరిగాయి. ఇళ్ల ధరలు సగటున 8 నుంచి 18 శాతం మేర పెరిగినట్టు అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. లగ్జరీ ఇళ్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిందని వెల్లడించారు. పండగ సీజన్లో ఇళ్ల అమ్మకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని.. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 3.49 లక్షల ఇళ్లు అమ్ముడవగా, ఈ ఏడాది చివరి నాటికి 4.5 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు అనుజ్ చెప్పారు. కాగా, 2022లో మొత్తం 3.65 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
This website uses cookies.