కోకాపేట్‌లో వేలం పాటల్ని నిర్వహించి.. పశ్చిమ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లాట్లను మధ్యతరగతి ప్రజలకు దూరం చేసిన హెచ్ఎండీఏ తాజాగా బుద్వేల్ చుట్టుపక్కల సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతిల్లు కొనుక్కోలేని దారుణమైన స్థితిలోకి నెట్టేసే ప్రయత్నంలో యమబిజీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఒకట్రెండేళ్లకే బుద్వేల్‌లో ఐటీ పార్కు వస్తుందని ప్రభుత్వం హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలైన కిస్మత్‌పూర్, బండ్లగూడ, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో చదరపు అడుక్కీ రూ.1000 నుంచి రూ.1500 వేలు పెరిగేలా చేసింది. అంటే, డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లను కొనుక్కోవాలంటే పది నుంచి పదిహేను లక్షలు అధికంగా పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా, కోకాపేట్ వేలం తర్వాత బుద్వేల్ మీద పడింది. ఇక్కడా ప్లాట్లను ఎక్కువ ధరకు విక్రయించి రియల్ రంగం మస్తుగుందనే ప్రచారం చేసే పనిలో నిమగ్నమైంది.
ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్ లే అవుట్ లో 14 ప్లాట్లను హెచ్ఎండిఏ వేలం నిర్వహిస్తుంది. ఇక్కడి లేఅవుట్ లో ప్లాట్ సైజులు కనీసం 3.47 ఎకరాలు, గరిష్టం 14.3 ఎకరాలుగా ఉన్నాయి. బుద్వేల్ ప్లాట్ల వేలంపై ఆదివారం టీ – హబ్ లో హెచ్ఎండిఏ నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి హైదరాబాద్లోని మధ్యతరగతి బిల్డర్లలతో పాటు దేశంలో గుర్తింపు కలిగిన బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి బుద్వేల్ లేఅవుట్ ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గురించి వివరించారు. కొందరు డెవలపర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు సమాధానాలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, డైరెక్టర్ (ప్లానింగ్) శ్రీనివాస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్.కే మీరా, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఓఎస్డి రాంకిషన్, బుద్వేల్ సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
This website uses cookies.