Categories: LEGAL

మోసం కేసులో బిల్డర్ అరెస్ట్

ఐదుగురు ఫ్లాట్ కొనుగోలుదారులను రూ.10 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో జయేష్ షా (59) అనే బిల్డర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా అనే హౌసింగ్ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన అవద్ షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ కొనుగోలు కోసం తాను రూ.98.39 లక్షలు చెల్లించగా.. మరో నలుగురు కలిసి రూ.8.48 కోట్లు చెల్లించినట్టు అవద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు 2012లో ఫ్లాట్లు అప్పగిస్తానని జయేష్ హామీ ఇచ్చారని.. కానీ దాదాపు దశాబ్ద కాలం గడుస్తున్నా ఫ్లాట్లు అప్పగించలేదని వివరించారు. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదని తెలిపారు. పైగా బీఎంసీ నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులూ కూడా తీసుకోలేదని తెలిసి తాము షాక్ కు గురయ్యామని అవద్ వివరించారు. ఆ భవనానికి 17 అంతస్తుల వరకే అనుమతి ఉండగా.. బిల్డర్ 18 అంతస్తులు నిర్మించాడని.. అంతటితో ఆగకుండా 27 అంతస్తుల వరకు బుకింగ్స్ కూడా చేశాడని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జయేష్ షా ఆ మొత్తాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్టు గుర్తించారు. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాగా, ఇప్పటికే జయేష్ పై చీటింగ్ కేసు నమోదై ఉంది.

This website uses cookies.