దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు గత 16 నెలల్లో 1361 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా గతేడాది జూలై నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఈ లావాదేవీలు జరిగాయని వెల్లడించింది. అలాగే 380 ఎకరాల్లో జాయింట్ డెవలప్ మెంట్ కోసం భూ యజమానులతో ఒప్పందం చేసుకున్నారని.. వార్షిక అద్దె ప్రాతిపదికన 16 ఎకరాలు లీజుకు తీసుకున్నారని.. ఇలా మొత్తం 1757 ఎకరాలకు సంబంధించి లావాదేవీలు జరిగాయని వివరించింది. ‘కోవిడ్ కు ముందు దాదాపు ఏడెనిమిది నెలలపాటు నగదు కొరత కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కాస్త ఒడుదొడుకులకు లోనైంది. ఇక కోవిడ్ వచ్చిన తర్వాత నాలుగైదు నెలలపాటు దాదాపుగా నిలిచిపోయింది. అయితే, 2020 మూడో త్రైమాసికం నుంచి రియల్ రంగంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పలువురు భూ యజమానులు తమ భూములను అమ్మకానికి పెట్టారు. తాజాగా గతేడాది చాలా పెద్ద డీల్స్ జరిగాయి. గతేడాది ఉన్న ధరలకు దాదాపు అటూ ఇటూగా ఈ ఒప్పందాలు పూర్తయ్యాయి’ అని అన్ రాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు.
This website uses cookies.