Categories: LATEST UPDATES

అలాంటి కాల్స్ వస్తే బిల్డర్లు, బ్రోకర్లదే బాధ్యత

పెస్కీ కాల్స్ నియంత్రణకు ప్రభుత్వం ప్రతిపాదన

మనం ఎంతో బిజీగా ఉన్న సమయంలో లేదా డ్రైవింగ్ లో ఉన్న సమయంలో.. మీకు లోన్ కావాలా? మా దగ్గర అమ్మకానికి ప్లాట్లు ఉన్నాయి చూస్తారా అంటూ వచ్చే ఫోన్ కాల్స్ చిరాకు కలిగించక మానవు. ముఖ్యంగా ట్రాయ్ వద్ద నమోదు చేసుకోకుండా ఇలాంటి ఫోన్ కాల్స్ చేస్తే.. అందుకు బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బ్రోకర్లు, ఇతర సంస్థలను బాధ్యులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. చాలామందికి ఇబ్బంది కలిగించే ఇలాంటి కాల్స్ కు చెక్ చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది.

‘డు నాట్ డిస్టబ్’ వంటి సర్వీసు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడిచినా.. ఇలాంటి కాల్స్ నియంత్రణలో చర్యలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలాంటి సంస్థల చేతుల్లోకి వెళ్లడం.. వాళ్లు కాల్స్ చేసి విసిగిస్తుండటంపై ట్రాయ్ కూడా సీరియస్ గా ఉంది. అయితే, వీటిని నియంత్రించడానికి సరైన మెకానిజం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల విభాగం దీనిపై స్పందించింది. ఇలాంటి అవాంఛిత కాల్స్ వినియోగదారుల హక్కులను అతిక్రమించడమేనని.. ఇవి సరికావని పేర్కొంది. వీటిని నియంత్రించేందుకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని సంబంధిత విభాగాలకు సూచించింది.

ట్రాయ్ వద్ద నమోదు చేసుకోకుండా బిజినెస్ ప్రమోషన్ కోసం చేసే కాల్స్ ను పెస్కీ కాల్స్ అంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కాల్స్ ను గుర్తించే విధంగా చర్యలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మూడు సిరీస్ లు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. 140 సిరీస్ తో మొదలయ్యే ఫోన్లు మార్కెటింగ్ కోసం, 160తో మొదలయ్యే ఫోన్ నంబర్లు సేవల కోసం. 111 సిరీస్ తో మొదలయ్యే ఫోన్ నంబర్లు.. ప్రభుత్వం నుంచి వచ్చే అప్రమత్తత సందేశాల కోసం వినియోగించాలని యోచిస్తోంది. దీంతో తమకు వచ్చే ఫోన్ నంబర్ సిరీస్ ను బట్టి ప్రజలు అవి వేటికి సంబంధించినవో సులభంగా గుర్తించే వీలుంటుందని అంటున్నారు.

This website uses cookies.