నిర్మాణ ప్రదేశాల్లో పనిచేసేవారి రక్షణ బాధ్యత ఆయా బిల్డర్లదేనని న్యాయస్థానం మరోసారి స్పష్టంచేసింది. ఆరేళ్ల క్రితం ఓ నిర్మాణ ప్రదేశంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడి మృతి చెందిన 20 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని సదరు బిల్డర్ ను ఆదేశించింది. మృతుడి తల్లికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని బిల్డర్ కు తేల్చి చెప్పింది. సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ వంటివి నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేయలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు ముంబైలోని లేబర్ కోర్టు తీర్పు వెలువరించింది. 2016 నవంబర్ 4న డరోగా చౌహాన్ అనే 20 ఏళ్ల యువకుడ నవీ ముంబైలోని ఓ నిర్మాణ ప్రదేశంలో ఏడో అంతస్త నుంచి కింద పడి చనిపోయాడు.
అయితే, అతడి మృతికి పరిహరంగా అటు నిర్మాణ కంపెనీ రామేశ్వర్ ఇన్ ఫ్రా పార్ట్ నర్స్ కానీ ఇటు బీమా కంపెనీ కానీ ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీనిపై చౌహాన్ తల్లి లీలా దేవి 2018లో లేబర్ కోర్టును ఆశ్రయించారు. అయితే, చౌహాన్ షిప్ట్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, కానీ అతడు ఉదయం 8.45 గంటలకు చనిపోయినందున ఆ సమయంలో తమ విధుల్లో లేడని నిర్మాణ కంపెనీ వాదించింది. దీనిని కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం బిల్డర్ దే తప్పని పేర్కొంటూ రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
ఈ మొత్తాన్ని బీమా సంస్థ కాకుండా బిల్డరే చెల్లించాలని స్పష్టంచేసింది. ‘నిర్మాణ ప్రదేశాల్లో కార్మికులకు సరైన భద్రతా చర్యలు చేపట్టడంలో కంపెనీ విఫలమైంది. అందువల్ల ఈ కేసులో బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. రామేశ్వర్ ఇన్ ఫ్రా పార్ట్ నర్స్ మృతుడి తల్లికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి’ అని పేర్కొంది.
This website uses cookies.