ఫ్లాట్ల విక్రయం పేరుతో 31 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా మొత్తం వసూలు చేసి పత్తా లేకుండా పోయిన ఓ బిల్డర్ ను పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని ఘజియాబాద్ కు చెందిన దీపక్ గుసెయిన్ 2012లో తన కంపెనీ ఏసియన్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ హర్యానాలోని రెవారీలో నిర్మిస్తున్న ప్రాజెక్టులో ప్లాట్లు, షాపులు అమ్మకానిక ఉన్నాయని ప్రకటనలు గుప్పించారు. దీంతో పలువురు వ్యక్తులు ఆ ప్రాజెక్టులు ఫ్లాట్లు, షాపులు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించారు. 27 నెలల్లో ఫ్లాట్లు అప్పగిస్తానని చెప్పిన దీపక్.. వారి నుంచి విడతలవారీగా మరికొంత మొత్తం వసూలు చేశాడు. ఇలా రూ.10 కోట్లకు పైగా మొత్తం తీసుకున్న తర్వాత కనిపించకుండా పోయాడు.
దీంతో 2014 ఏప్రిల్ లో నిర్మాణం కూడా ఆగిపోయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. వాస్తవానికి ఆ భూమిని హర్యానా రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (హెచ్ఎస్ఐఐడీసీ) తన కంపెనీ సిబ్బందికి ఇళ్లు నిర్మించడం కోసం కేటాయించిందని తేలింది. ఈ విషయాన్ని దీపక్ దాచిపెట్టి అవాస్తవ ప్రకటనలతో కొనుగోలుదారులను మోసం చేశారని పోలీసులు గుర్తించారు. అయితే, అప్పటి నుంచి కనిపించకుండా పోయిన దీపక్ ను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. అతడిపై లుక్ ఔట్ నోటీసు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా అతడు తిలక్ నగర్ మెట్రో సమీపంలోని ఓ డెంటల్ క్లినిక్ లో ఉన్నట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించిన ఢిల్లీ పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
This website uses cookies.