- కేంద్ర గృహ నిర్మాణ కార్యదర్శి మనోజ్ జోషి
రియల్ రంగంలో బిల్డర్లకు కూడా రేటింగ్ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు. మంచి బిల్డర్లు, చెడ్డ బిల్డర్ల మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. ఇలా ఉన్నప్పుడు రియల్ ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కొనుగోలుదారులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. సీఐఐ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు.. ముఖ్యంగా హౌసింగ్ ప్రాజెక్టులు కస్టమర్ అడ్వాన్సుల ద్వారా వచ్చే నిధులతోనే నడుస్తున్నాయని.. ఈ విధానం మారాలని అభిప్రాయపడ్డారు. బిల్డర్ల గత పనితీరు ఆధారంగా వారికి రేటింగ్ ఇచ్చే విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్నారు. చాలా ప్రాజెక్టుల్లో జాప్యం జరగడానికి నగదుపరమైన ఇబ్బందులే కారణమని వ్యాఖ్యానించారు.