క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ
” క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా చెబుతున్నాను.. నేను ప్రీలాంచులకు పూర్తిగా వ్యతిరేకం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించను. మా బిల్డర్లలో ఎవరైనా ఇప్పటికీ, ప్రీలాంచులు చేస్తుంటే గనక.. వాటిని పూర్తిగా నిలిపి వేయాల్సిందే. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ప్రీలాంచులకు అడ్డుకట్ట వేయాల్సిన తరుణమిదే.. లేకపోతే, రానున్న రోజుల్లో ఈ రంగం మరింత దారుణంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంద”ని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన రియల్ ఎస్టేట్ గురు స్టూడియోకి విచ్చేసి ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు. మరి, ఆయన పలు ప్రశ్నలకిచ్చిన సమాధానాలిలా ఉన్నాయ్.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయ్? గవర్నమెంట్ మారిపోయిన వెంటనే రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, అలాంటిదేం ఉండదు. గతంలో మార్కెట్ ఎలా ఉండిందో ఇప్పుడూ అలానే ఉంది. రియాల్టీకి వచ్చిన నష్టమేం లేదు. మేం కూడా సీఎంను కలిసి రియాల్టీకి సంబంధించిన పలు అంశాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నాం.
గత మూడు నెలల్లో అమ్మకాలు తగ్గాయనే వార్తలు వినిపిస్తున్నాయి కదా సార్? ఎన్నికల సమయంలో కొంత స్తబ్దత ఏర్పడుతుందనే విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలయ్యాక మార్కెట్ పికప్ అయ్యింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల సమయం కదా.. ఇప్పుడు కొంతమేరకు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. అలాగనీ, అమ్మకాలు పూర్తిగా తగ్గాయనేది వాస్తవం కాదు.
నాకో డౌట్ సార్. మార్కెట్లో ఎండ్ యూజర్లు కొనేది సేల్ అంటామా? లేక ఇన్వెస్టర్లు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్లను సేల్ అంటామా? ఎప్పుడైనా ఎండ్ యూజర్ కొనేదే సేల్ అంటాం. ఎంతమంది హోమ్ బయ్యర్లు కొన్నారు? గతేడాది ఎంతమంది కొన్నారు? ఎన్ని డెలివరీ చేశామనేది చెబుతాం తప్ప.. ఎంత మంది ఇన్వెస్ట్ పెట్టారని చెప్పం కదా..
మీరు గత నాలుగైదేళ్ల నుంచి గమనిస్తే.. ఇన్వెస్టర్లు పెరిగిపోయారు. ప్రీలాంచ్ సేల్స్, యూడీఎస్, రెంటల్ స్కీమ్స్, బైబ్యాక్ స్కీమ్స్ వంటివి చాలా కనిపిస్తున్నాయా? ఇవి మార్కెట్‌కు ప్రయోజనకరమా? నష్టాన్ని కలిగిస్తున్నాయా? ప్రీలాంచ్ చేసే బిల్డర్ కొంత డబ్బు సంపాదిస్తాడు కావొచ్చు. కానీ, ప్రీలాంచుల వల్ల అంతిమంగా కొనుగోలుదారుడే నష్టపోతాడని గుర్తించాలి. ఇందుకోసమే కదా మన దేశంలో రెరా అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో కొందరు బిల్డర్లు ముందే కొనుగోలుదారుల వద్ద అడ్వాన్సులు తీసుకుని.. పది, పదిహేనేళ్లయినా అపార్టుమెంట్లను బయ్యర్లకు డెలివరీ చేయలేదు. అందుకే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెరాను అందుబాటులోకి తెచ్చింది. క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా చెబుతున్నాను.. నేను ఈ ప్రీలాంచ్ అమ్మకాలకు పూర్తిగా వ్యతిరేకం. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను ప్రీలాంచులను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించను.
చాలా సంతోషం సార్.. మీరొక చక్కటి మాట చెప్పారు. మరి, ప్రీలాంచ్‌లకు అడ్డుకట్ట వేయడానికి మీరు ఎలాంటి ప్రణాళికల్ని రచిస్తున్నారు? మేం కేవలం కొనుగోలుదారులనే కాదు.. బిల్డర్లను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. మా క్రెడాయ్ తెలంగాణలో ప్రతి బిల్డర్‌కు స్పష్టంగా చెబుతున్నాం. ఎవరైనా ఇలాంటి ప్రీలాంచుల్ని చేస్తుంటే.. మానివేయాలని అంటున్నాం. ప్రీలాంచ్ సేల్స్ అనేవి హైదరాబాద్లోనే కాదు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కనిపిస్తున్నాయి. రెరా అనుమతి లేకుండా కొందరు విక్రయిస్తున్నారు. బయ్యర్లు కూడా రేటు తక్కువ అని చూస్తున్నారే తప్ప..వాటిని డెలివరి చేస్తారా? లేదా? అనేది ఎవ్వరూ చూడటం లేదు. అందుకే, నేను కొనుగోలుదారులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రీలాంచుల్లో కొంటే మీరే నష్టపోతారు.అందుకే, ఎట్టి పరిస్థితిలో కొనకూడదని విజ్ఞప్తి చేస్తున్నా.
గత రెండు, మూడేళ్లలో ఫ్లాట్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవడం వల్లే ప్రీలాంచుల్లో కొంటున్నామని కొందరు ప్రజలు అంటున్నారు. అసలు మార్కెట్లో ఫ్లాట్ల ధరలు ఎందుకు అమాంతంగా పెరిగిపోయాయి? చెన్నై, బెంగళూరు, పుణే రేట్లతో పోల్చితే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలెంతో తక్కువగా ఉన్నాయి. మన వద్ద భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇందుకు కారణమేమిటంటే.. అభివృద్ధి అనేది కేవలం పశ్చిమం వైపే కేంద్రీకృతమైంది. అందుకే, అక్కడ భూముల రేట్లు, ఆ తర్వాత ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయి. అలా కాకుండా, నగరంలోని ఇతర దిక్కుల్లో మార్కెట్ విస్తరిస్తే బాగుంటుంది. కనెక్టివిటీ పెరిగింది. కార్ల సంఖ్య అధికమైంది. కాబట్టి, బయ్యర్లు కూడా ఇతర మార్గాల వైపు దృష్టి సారిస్తే బాగుంటుంది. మీరు బెంగళూరును గమనిస్తే.. అభివృద్ధి అనేది నాలుగు వైపులా కేంద్రీకృతమైంది. అందరూ ఒకేచోట ఉండాలని కోరుకున్నప్పుడు అక్కడే డిమాండ్ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ధరలు పెరగడం సహజమే కదా.
మీరు ముంబై, చెన్నై వంటి నగరాలతో హైదరాబాద్‌ను పోల్చారు. కానీ, ఆయా నగరానికి భౌగోళికపరమైన అడ్డంకులున్నాయి. కానీ, హైదరాబాద్‌లో అలాంటి సమస్యల్లేవు కదా సార్. అలాంటప్పుడు, భూముల ధరలు పెరగాల్సిన అవసరమేం ఉంది? అదే చెబుతున్నాను.. ప్రభుత్వం ఏం చేయాలంటే.. నగరంలోని ఇతర వైపుల ఐటీ, పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. అలాంటి ప్రయత్నం గత ప్రభుత్వం కొంత మేరకు చేసింది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేయాలి. వాస్తవంగా, మన హైదరాబాద్ నగరానికి గల అత్యుత్తమ లక్షణాల కారణంగా.. దేశంలోని ఇతర నగరాల నుంచి ఇక్కడికి విచ్చేసేవారి సంఖ్య పెరుగుతుంది. మీరు హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలను గమనిస్తే.. యూనిటీ ఇన్ డైవర్సిటీని ప్రత్యక్షంగా గమనించొచ్చు. అందుకే, ఇతర నగరాలతో పోల్చితే మన వద్ద రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయి.
రేట్లు తక్కువే ఉన్నాయి కాబట్టి, ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నారా? రేట్లు పెరగాలని అయితే కోరుకోవట్లేదు. క్రెడాయ్ అధ్యక్షుడిగా నేనెప్పుడు కోరుకునేదేమిటంటే.. ఒక బెస్ట్ ప్రాడక్ట్‌ను బెస్ట్ రేటుకు ఇవ్వాలనే కోరుకుంటాను.
ఓవరాల్‌గా చూసుకుంటే, మీ క్రెడాయ్ తెలంగాణలో ఎన్ని ఛాప్టర్లు ఉన్నాయి సార్? మా వద్ద మొత్తం పదిహేను ఛాప్టర్లు ఉన్నాయి. ఎనిమిది వందల యాభై దాకా సభ్యులున్నారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా గనక లెక్కిస్తే.. క్రెడాయ్ తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంటుంది. మరో ఐదు ఛాప్టర్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రెండు, మూడు నెలల్లో ఆ ప్రక్రియనూ ఆరంభిస్తాం.
ఈమధ్య ఇతర రాష్ట్రాలకు చెందిన క్రెడాయ్ ప్రతినిధులు మన రాష్ట్రానికి ఒక టూర్ తరహాలో విచ్చేశారు కదా.. మరి, మీరేమైనా ప్లాన్ చేస్తున్నారా? ఔను, మహారాష్ట్ర మరియు పుణె రాష్ట్రాలకు చెందిన ఛాప్టర్లు హైదరాబాద్‌కు విచ్చేసి ఇక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్, కొన్ని ప్రాజెక్టులను గమనించారు. అతిత్వరలో మేం కూడా ఇతర రాష్ట్రాలకు టూర్ చేయనున్నాం. రానున్న జులైలో హైదరాబాద్‌లో స్టేట్‌కాన్ కూడా నిర్వహించడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం. అందులో మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం.
అసలు తెలంగాణ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? జీవో నెం.50ని పూర్తిగా తొలగించాలి. 168 జీవోను మాత్రమే మనం అనుసరించాలి. ఎందుకంటే, మేమంతా ఎకరం స్థలంలో లక్షల చదరపు అడుగుల నిర్మాణం కడుతున్నాం. రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకే కేంద్రీకృమవుతోంది. ఇప్పటికే పీక్ అవర్స్‌లో ఇలాంటి కొన్ని కమ్యూనిటీలో నుంచి రాకపోకల్ని సాగించడానికి ఎక్కువ సమయం పడుతోంది. జిల్లాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత ఉంది. ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఒకే సార్.. ప్రీలాంచులు చేసే బిల్డర్లు ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారంటారా? హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి పెద్ద నగరాల్లో ప్రీలాంచ్ వ్యాపారం జరుగుతోంది.
మరి, వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఎలా? ప్రభుత్వమేం చేయాలి? నిర్మాణ రంగమేం చేయాలి? ప్రీలాంచుల్ని పరిష్కరించడానికే రెరా ఏర్పాటైంది. రెరా ఛైర్మన్‌గా సత్యనారాయణ గారిని నియమించారు. అయితే, వారు కొంత స్ట్రిక్టుగా వ్యవహరించాలి. నోటీసుల్ని పంపించాలి. ఫోకస్ట్‌గా వ్యవహరిస్తూ వెళితే ప్రీలాంచులకు అడ్డుకట్ట పడుతుంది. ప్రీలాంచుల్ని చేసేవారి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ దశలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. ఇప్పుడే గనక మేల్కొనకపోతే, తర్వాతర్వాత ఏం చేయాలన్నా చేయలేం. ప్రీలాంచులు చేసేవారు ఎంత పెద్ద బిల్డర్ అయినా కచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇందులో కాంప్రమైజ్ అవ్వనే అవ్వకూడదు.
టీఎస్ రెరా అథారిటీ సోషల్ మీడియా మీద ఫోకస్ చేస్తే సగం సమస్య తగ్గిపోతుంది కదా? అవును. ప్రభుత్వం రెరాలో స్టాఫ్‌ను నియమించాలి. సోషల్ మీడియా మీద రెరా ఫోకస్ పెట్టాలి. ఈమధ్య రెరా చీఫ్‌తో మాట్లాడాం. అతిత్వరలో రెరా మరింత యాక్టివ్ అవుతుందనే నమ్మకం ఉంది.
మరి, ప్రీలాంచులకు అడ్డుకట్ట వేయడానికి క్రెడాయ్ తరఫున మీరు రెరాకు సపోర్టు చేస్తున్నారా? ప్రీలాంచుల్ని తగ్గించడానికి మేం రెరాకు వంద శాతం సపోర్టు చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మా వద్ద ఉన్న సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు అందజేస్తాం. జిల్లాల్లో వారు రెరాపై అవగాహన కార్యక్రమాల్ని చేపడితే మేం హెల్ప్ చేస్తాం. ప్రీలాంచుల్లో మోసపోయేది అంతిమంగా సామాన్యులే కదా.. అందుకే, వారు మోసపోకుండా రెరా చేపట్టే కార్యక్రమాలకు మా తరఫున సాయం చేస్తాం. మేం కూడా ప్రతి జిల్లాల్లో ఇందుకు సంబంధించి అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాం. రెరా ఎందుకొచ్చిందనే విషయాన్ని కొనుగోలుదారులకు తెలియజేస్తే చాలు.. వాళ్లు ఎంతో కాషీయస్‌గా ఉంటారు.